బెదిరింపులు.. కిడ్నాపులు

29 Mar, 2018 13:13 IST|Sakshi
సునీల్‌

కుదరకపోతే హత్యలు గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌

అరాచకాలతో బెంబేలు  ప్రొద్దుటూరులో సునీల్‌పై 7 కేసులు

ప్రొద్దుటూరు క్రైం :సుమారు ఆరేళ్ల క్రితం సునీల్‌ పేరు చెబితే చాలు ప్రొద్దుటూరులోని వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు బెంబేలెత్తేవారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌ పోలీసుల చెర నుంచి మంగళవారం రాత్రి తప్పించుకొని పోయిన సంఘటన సంచలనం కలిగిస్తోంది. సునీల్‌ అరాచకాలు 2012 నుంచి వెలుగులోకి వచ్చాయి. అంతకు ముందు ఎర్రచందనం రవాణా చేస్తూ పోలీసులకు చిక్కినా సాధారణ స్మగ్లర్‌గానే పోలీసులు పరిగణించారు. ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు రోడ్డులో ఉన్న డాబాలో విధ్వంసం సృష్టించాడు. ఆ సంఘటనతో సునీల్‌ అరాచకాలు వెలుగు చూశాయి. సునీల్‌ బెదిరింపులు, కిడ్నాపులు, హత్యలు కడపతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాలకు ప్రాకాయి.

ఆటో డ్రైవర్‌ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా
మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన సునీల్‌ మొదట ఆటో డ్రైవర్‌. తర్వాత కిడ్నాపర్‌గా ఎదిగి పోలీసులకు చిక్కాడు. తన అరాచకాలు సాగించేందుకు 20–25 ఏళ్ల యువతను ఎంచుకున్నాడు. వారిని విలాసాల మత్తులో ముంచి తన  వ్యూహాల అమలుకు ఉపయోగించుకునేవాడు. సునీల్‌ చేతిలో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకున్న వారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు, యువకులు కావడం బాధాకరమైన విషయం. కడప, అనంతపురం జిల్లాలో ఉండే విద్యార్థులను ఎక్కువగా చేరదీసేవాడు. వారికి ఖరీదైన దుస్తులు, మద్యం, విలాసవంతమైన వస్తువులు కొనివ్వడంతో తెలిసీ తెలియని వయసులో విద్యార్థులు, యువకులు అతని మాయలో పడ్డారు. మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అతని వలలో పడి జైలు పాలయ్యారు.

ప్యాపిలి పోలీసుల దర్యాప్తుతో సునీల్‌ అరాచకాలు వెలుగులోకి
కిడ్నాపులు, అక్రమ వసూళ్లు, హత్యలకు పాల్పడుతున్న సునీల్, విద్యార్థుల గుట్టును ప్యాపిలి పోలీసులు 2013లో బయట పెట్టిన తీరు ఆసక్తికరంగా మారింది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం ఎస్‌ఐ జయన్న ఓ తలారి ఫోన్‌ కాల్‌కు స్పందించి గుర్తు పట్టలేని మృతదేహంపై జరిపిన పరిశోధన ఫలితంగా సునీల్‌ ముఠాను పట్టుకున్నారు. తాడిపత్రిలోని  అరవింద్‌ ఆస్పత్రిలో వంశీ మెడికల్‌ స్టోర్‌ ఉంది. మెడికల్‌ స్టోర్‌ నిర్వాహకుడు వాసురాం ప్రసాద్‌ కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో కుమారుడు వంశీ తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జలదుర్గం పోలీసు స్టేషన్‌ పరిధిలో గుర్తు తెలియని శవం వద్ద దొరికిన తాళాల గుత్తిని చూపించగా అది  తమదే అని వంశీ చెప్పడంతో మృతి చెందిన వ్యక్తి వాసురాం ప్రసాద్‌గా గుర్తించారు. అప్పటికే జైల్లో ఉన్న సునీల్‌ వాసురాం ప్రసాద్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతన్ని విచారించగా కిడ్నాపులు, బెదిరింపు సంఘటనలు వెలుగు చూశాయి.

సునీల్‌ గ్యాంగ్‌ ఆగడాలు..
సునీల్‌ గ్యాంగ్‌ ఆగడాలు ప్రొద్దుటూరులో అప్పట్లో శ్రుతి మించిపోయాయి. జిల్లాలో కిడ్నాపులకు పాల్పడ్డ సునీల్‌ 2012 జూలై 11న మరో ఇద్దరితో కలిసి ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు బైపాస్‌రోడ్డులో ఉన్న డాబాలో విధ్వంసం సృష్టించాడు. హోటల్‌లో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి మహిళపై దాడి చేశాడు. ఈ సంఘటనపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత అదే నెల 26న తమపై కేసు పెడతారా అంటూ అదే డాబాపై మళ్లీ సునీల్‌ దాడి చేశాడు. 2012 జూన్‌ 14న పట్టణంలోని గ్యాస్‌ ఏజెన్సీ యజమానిని బెదిరించి రూ. 50 లక్షలు డిమాండ్‌ చేశాడు. భయపడిన బాధితులు రూ.32 లక్షలు, తర్వాత రూ.18 లక్షలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 2013 లో ఆర్టీసి డ్రైవర్‌ను బెదిరించి రూ.10 లక్షలు డిమాండు చేశాడు. ప్రొద్దుటూరులోని వన్‌టౌన్‌లో మూడు కేసులు, త్రీ టౌన్‌లో 2, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో రెండు కేసులు సునీల్‌పై నమోదయ్యాయి. పోలీసుల నుంచి సునీల్‌ తప్పించుకున్నాడని తెలియడంతో ప్రొద్దుటూరులోని పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు భయాందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు