మాధాపూర్‌లో లింగనిర్ధారణ పరీక్షలు

18 Apr, 2018 13:16 IST|Sakshi
సూర్యా ఆస్పత్రి వద్ద పోలీసులు

సినీఫక్కీలో ఆస్పత్రిపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి

ఇద్దరు ఆర్‌ఎంపీలతో సహా మరొకరి అరెస్ట్‌

పరీక్షలకు ఉపయోగించే స్కానర్, ప్రింటర్‌ సీజ్, 70వేల నగదు, కారు స్వాధీనం

‘‘ బేటీ బచావో.. బేటీకో పడావో అంటూ పాలకులు అవగాహన కల్పిస్తున్నా.. ఆడపిల్లని తెలిస్తే చాలు పురిట్లోనే చిదిమేస్తున్నారు... లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం.. ఎవరైనా వైద్యులు ఆ పరీక్షలు నిర్వహించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.. ఇది ఉన్నతాధికారుల హెచ్చరిక.. అయినా ప్రజలను ఎంతగా చైతన్య పరుస్తున్నా.. అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా..తల్లి గర్భంలోనే చిట్టితల్లులను అంతమొందిస్తున్న ఘటనలు కోకొల్లలు.. మంగళవారం తుర్కపల్లి మండలంలో ఎస్‌ఓటీ పోలీసుల దాడిలో ఈ విషయం మరోసారి తేటతెల్లమైంది.

తుర్కపల్లి (ఆలేరు) :లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఇద్దరు ఆర్‌ఎంపీలతో సహా ఓ నర్స్‌ను ఎస్‌ఓటీ పోలీసులు సినీ ఫక్కీలో దాడిచేసి అరెస్ట్‌ చేశారు. వివరాలు..  తుర్కపల్లి మండలం మాధాపూర్‌లోని సూర్య ఆస్పత్రిలో కొన్ని రోజులుగా లింగానిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఆడశిశువని తేలితే తల్లిగర్భంలోనే పిండాన్ని అంతమొందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్థానికులు ఈ ఘటనపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ ఎం భగవత్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన కేసును రాచకొండ ఎస్‌ఓటీ టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ రఫీకి అప్పగించారు.

సినీఫక్కీలో..
ఎస్‌ఓటీ సీఐ గంగాధర్‌ నేతృత్వంలో పోలీసులు బృందంగా ఏర్పడి  మాధాపూర్‌లోని సూర్య ఆస్పత్రిపై నిఘా పెట్టారు. ఆస్పత్రి కార్యకలాపాలు, ఎక్కడెక్కడి నుంచి ఈ ఆస్పత్రికి లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించుకునేందుకు వస్తున్నారని తెలుసుకున్నారు. అనంతరం గర్భంతో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌ జయమ్మను నెల క్రితం మేడ్చల్‌ జిల్లా కీసర మండలం బోగారంలో గల శ్రీదేవి నర్సింగ్‌ హోమ్‌కు పంపించారు. అక్కడ ఉన్న ఆర్‌ఎంపీ సుధాకర్‌ పరీక్షలు నిర్వహించి ప్రస్తుతం ఏమీ కనబడడం లేదు.నెల రోజుల తర్వాత రావాలని సూచించాడు. అందుకు రూ. 16వేలు ఖర్చవుతుందని తెలిపాడు.

పక్కా ప్లాన్‌తో..
ఆర్‌ఎంపీ సూచన మేరకు పోలీసులు నెలరోజుల పాటు నిరీక్షించారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పథకాన్ని రచించారు. అనుకున్న విధంగా మహిళా కానిస్టేబుల్‌ జయమ్మకు రూ. 16వేలు ఇచ్చి భోగారం ఆస్పత్రికి పంపించారు.  అక్కడి ఆర్‌ఎంపీ సుధాకర్‌ లింగానిర్ధారణ పరీక్ష నిమిత్తం జయమ్మను తుర్కపల్లి మండలం మాధాపూర్‌లోని సూర్య ఆస్పత్రికి తిసుకువచ్చాడు. అనంతరం పరీక్షలు నిర్వహిస్తుడగా ఎస్‌టీఓ సీఐ గంగాధర్, స్థానిక ఎస్‌ వెంకటయ్య, హెడ్‌ కానిస్టేబులు శ్రీరాములు, వైద్యాధికారి చంద్రారెడ్డి, పీసీలు ఇబ్రహీం, చంద్రశేఖర్, అరుణరెడ్డి ఆకస్మికంగా దాడులు నిర్వహించి సూర్య ఆస్పత్రి యజమాని ఆర్‌ఎంపీ నర్సింగ్‌రావును, మరో ఆర్‌ఎంపీ సుధాకర్‌ను,  నర్స్‌గా పనిచేస్తున్న ధీరవత్‌ సోనియాను అదుపులోకి తీసుకున్నారు రూ. 70వేల నగదుతో పాటు లింగనిర్ధారణ పరీక్షలకు ఉపయోగించే స్కానర్, ప్రింటర్, మానిటర్‌తో పాటు విలువైన పత్రాలు, కారును స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు