స్కూల్‌ బస్సులోంచి కింద పడి చిన్నారి మృతి

21 Jan, 2018 02:58 IST|Sakshi
అంజలి (ఫైల్‌)

డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో ఘటన 

పాఠశాలకు వెళుతుండగా వనస్థలిపురంలో ప్రమాదం 

హైదరాబాద్‌: స్కూల్‌కని వెళ్లిన ఓ చిన్నారిని మృత్యువు కానరాని లోకాలకు తీసుకెళ్లింది. స్కూల్‌ బస్సు రూపంలో వచ్చి చిదిమేసింది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలించింది. ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో ద్వారంలోంచి కింద పడి విద్యార్థిని మృతి చెందింది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ వనస్థలిపురంలోని ప్రశాంతి విద్యానికేతన్‌ స్కూల్‌ బస్సు విద్యార్థులను ఎక్కించుకొని వెంకటేశ్వర కాలనీ నుంచి సాహెబ్‌నగర్‌ మీదుగా బయలుదేరింది.

మార్గమధ్యంలో ఉన్న స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేకు వేయడంతో ద్వారం పక్కనే ఉన్న అంజలి(6) అనే ఒకటో తరగతి విద్యార్థిని రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అంజలి తల్లిదండ్రులు పావని, నాగయ్య సాహెబ్‌నగర్‌లోని గాయత్రినగర్‌లో కూలీనాలీ చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా అంజలి చిన్న కుమార్తె. ఉదయం బస్సు ఎక్కించి టాటా చెప్పిన తమకు అదే చివరిచూపు అవుతుందని అనుకోలేదని కూతురు మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.   బస్సులో క్లీనర్‌ ఉండి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదికాదని, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందారని బీజేపీతోపాటు పలు ప్రజాసంఘాలు ఆందోళన చేశాయి.  

మరిన్ని వార్తలు