గురుకుల విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా

12 Sep, 2019 08:37 IST|Sakshi
అలిగె కరుణాకర్‌ (ఫైల్‌): విద్యార్థి కరుణాకర్‌ మృతదేహాన్ని వెలికి తీస్తున్న గజ ఈతగాళ్లు

చెరువులో విద్యార్థి మృతదేహం లభ్యం

జేసీబీ గుంతలో ఊపిరాడక మృత్యువాత

విద్యార్థిని వెలికి తీసిన పోలీసులు

పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన

‍సాక్షి, దుబ్బాక: సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. మండల పరిధిలోని చెప్యాల క్రాస్‌ రోడ్డులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో చదువుతున్న విద్యార్థి కరుణాకర్‌ (14)  అల్వాల శివారులో ఉన్న చెరువులో ఈత సరిగా రాక చెరువులో ప్రమాదకరంగా ఉన్న జేసీబీ గుంతలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. 
ఈ ఘటన బుధవారం పాఠశాలలో విషాదం నింపింది.

సంగారెడ్డి జిల్లా మానూర్‌ మండలం ఎలుగోయ గ్రామానికి చెందిన అలిగె వసంత, అశోక్‌ దంపతుల ఏకైక కుమారుడు కరుణాకర్‌ (14) మండల పరిధిలోని చెప్యాల క్రాస్‌ రోడ్డులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 9వ తరగతి ‘బి’ సెక్షన్‌  చదువుతూ అదే హాస్టల్‌లో ఉంటున్నాడు. కరుణాకర్‌ చిన్న తనంలోనే తల్లి అనారోగ్యంతో చనిపోగా, తండ్రి ఇంటి నుంచి ఎటో వెళ్లి పోయాడు.  దీంతో కరుణాకర్‌ యోగ క్షేమాలను తన బాబాయ్‌ ప్రేమ్‌ కుమార్‌ అన్నీ తానై చెప్యాలలోని గురుకుల పాఠశాలలో చదివిస్తున్నాడు.  

గోడదూకి ఈతకు వెళ్లి.. 
మంగళవారం రోజున కరుణాకర్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు కలిసి రహస్యంగా ఎవ్వరికి చెప్పకుండా పాఠశాల ప్రహరీ గోడ దూకి అల్వాల శివారులో ఉన్న చెరువులో ఈత కొట్టడానికి వెళ్లిననట్లు సమాచారం. అందులో ఇద్దరు విద్యార్థులు తిరిగి పాఠశాలకు వెళ్లగా, కరుణాకర్‌ సాయంత్రమైనా పాఠశాలకు వెళ్లలేదని తెలిసింది. దీంతో మంగళవారం ఉదయం నుండి పాఠశాలలో కరుణాకర్‌ కనిపించడం లేదని గ్రహించిన ఉపాధ్యాయులు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

గజ ఈతగాళ్లతో గాలింపు.. 
సాయంత్రం అల్వాల శివారులోని జింకని చెరువులో కరుణాకర్‌కు చెందిన బట్టలు, చెప్పులు లభ్యమయ్యాయి. అనుమానంతో  రాత్రి వరకు జేసీబీ గుంతలో వెతికినా ఫలితం లేకుండా పోయింది.  దీంతో పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. తిరిగి బుధవారం తెల్లవారు జామున దుబ్బాక సీఐ హరికృష్ణ, మిరుదొడ్డి ఎస్‌ఐ ఎండీ. జమాల్, భూంపల్లి ఎస్‌ఐ రాజేష్‌ల నేతృత్వంలో తాళ్ళు, వలలు వినియోగించి గజ ఈతగాళ్ళతో చెరువులో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంట తరువాత కరుణాకర్‌ మృత దేహాన్ని వెళికి తీశారు. అదృశ్యమయ్యాడనుకున్న విద్యార్థి చెరువులో శవమై తేలడంతో గురుకుల పాఠశాలలో విషాదం అలుముకుంది.   విద్యార్థి కరుణాకర్‌ మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత 
చెరువులో పడి మృతి చెందిన కరుణాకర్‌ మృతదేహాన్ని తమకు చూపించకుండా, ఎలాంటి సమాచారం అందించకుండా పోస్టు మార్టం కోసం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి ఎలా తరలిస్తారని మృతుడు విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురుకుల పాఠశాల ఎదుట బైటాయించి ఆందోళనకు దిగారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, కేవీపీఎస్, జిల్లా పేరెంట్స్‌ అసోసియేషన్‌  కమిటీ బృందం సభ్యులు మద్ధతు తెలుపుతూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.  చనిపోయిన విద్యార్థిని పాఠశాల వద్దకు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు. విషయాన్ని అడిగి తెలుసుకుందామని వచ్చిన ఆర్‌సీఓ నిర్మల కారును అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని ఆర్సీఓతో వాగ్వాదానికి దిగారు. 

ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి 
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ పర్యవేక్షణ లేకనే ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అరవింద్, భిక్షపతి, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు జోగేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ఘ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధిత కుటంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా పోలీసులతో వాగ్వివాదాలు జోరందుకోవడంతో ఎస్‌ఎఫ్‌ఐ, కేవీపీఎస్‌ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

న్యాయం జరిగేలా చర్యలు 
గురుకుల పాఠశాలలో జరిగిన విషాదకర సంఘటనపై విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, కేసుకు సంబంధించిన  ఏవైనా అనుమానాలు ఉంటే తమకు పిర్యాదు చేస్తే ఆ దిశగా దర్యాప్తు చేస్తామని దుబ్బాక సీఐ హరికృష్ణ విద్యార్థి కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమనిగింది. కాగా గురుకుల పాఠశాలలో జరిగిన విషాదకర సంఘటనపై ఎంపీపీ గజ్జెల సాయిలుతో పాటు, తహసీల్దార్‌ పద్మారావు, ఎంఈఓ జోగు ప్రభుదాసు, ఎంపీడీఓ సుధాకర్‌ రావు, ఆర్‌ఐ శ్రీనివాస్, అల్వాల, చెప్యాల సర్పంచులు ఎనగంటి కిషయ్య, మాసపురం లక్ష్మిలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా