తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా!

2 May, 2019 01:52 IST|Sakshi

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని డిస్కంల వెబ్‌సైట్ల హ్యాక్‌

ర్యాన్‌సమ్‌వేర్‌ వైరస్‌తో రెచ్చిపోయిన హ్యాకర్లు

రూ.35 కోట్లకు పైగా డబ్బులు డిమాండ్‌

సర్వర్లలోని సమాచారం తొలగింపు 

టీసీఎస్‌ నిర్వహిస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్, ఆంధ్రాబ్యాంక్‌ సైట్లు సైతం హ్యాక్‌!  

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలపై ఆన్‌లైన్‌ హ్యాకర్లు రెచ్చిపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థల వెబ్‌సైట్లను హ్యాక్‌ చేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌), హన్మకొండ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎన్పీడీసీఎల్‌), తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ ఆంధ్ర ప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్‌), వైజాగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌)ల అధికారిక వెబ్‌సైట్లపై అంతర్జాతీయ హ్యాకర్లు పంజా విసిరారు. ర్యాన్‌సమ్‌వేర్‌ వైరస్‌ ద్వారా సర్వర్లలో ఉన్న డేటాను హ్యాకర్లు తస్కరించారు. అనంతరం సర్వర్లలో ఉన్న డేటాను పూర్తిగా డిలీట్‌ చేశారు. తస్కరించిన డేటాను వెనక్కి ఇచ్చేందుకు రూ.35 కోట్లకు పైగా డబ్బులు ఇవ్వాలని హ్యాకర్లు మెయిల్‌ పంపించినట్లు అధికారులు తెలిపారు. అయితే, 4 డిస్కంలకు సంబంధించిన సర్వర్లకు బ్యాకప్‌ ఉండడంతో డేటా భద్రత సమస్య తప్పింది.  

తిరుపతిలో డిస్కంల సర్వర్లు.. 
నాలుగు డిస్కంల ద్వారానే 2 రాష్ట్రాలకు విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. ఈ సంస్థల వెబ్‌సైట్లను తిరుపతి కేంద్రంగా టాటా కన్సల్టెన్సీ లిమిటెడ్‌(టీసీఎస్‌) నిర్వహిస్తోంది. ఉమ్మడి ఏపీ నుంచే డిస్కంల వెబ్‌సైట్ల సర్వర్లను తిరుపతి నుంచి నిర్వహిస్తున్నారు. గుర్తుతెలియని మెయిల్స్‌ను తెరవగానే వీటి సర్వర్లలో వైరస్‌ చొరబడి వెబ్‌సైట్లను హ్యాక్‌ చేసింది. సర్వర్ల నుంచి మొత్తం డేటాను డిలీట్‌ చేయడంతోపాటు వాటిని తెరుచుకోకుండా చేశారు. మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురికావడంతో 2 రోజులుగా ఆన్‌లైన్, పేటీఎం ద్వారా విద్యుత్‌ బిల్లుల చెల్లింపు స్తంభించిపోడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు.  

టీసీఎస్‌ నిర్వహిస్తున్న వెబ్‌సైట్లే లక్ష్యం.. 
హ్యాకర్లు టీసీఎస్‌ కంపెనీ నిర్వహిస్తున్న పలు సంస్థల వెబ్‌సైట్లపై దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలోని 4 డిస్కంలతో పాటు ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సైతం హ్యాకింగ్‌కు పాల్పడినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దీనితో పాటు ఆంధ్రాబ్యాంక్‌ వెబ్‌సైట్‌ను సైతం టార్గెట్‌ చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై ఇప్పటివరకు ఆంధ్రాబ్యాంక్, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  

హ్యాకింగ్‌ నిజమే.. 
తమ సంస్థ వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయినట్లు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి ధ్రువీకరించారు. సంస్థ వెబ్‌సైట్‌ నిర్వహణ బాధ్యతలను టీసీఎస్‌కు అప్పగించామని, టీసీఎస్‌తో కలసి సంస్థ ఐటీ నిపుణులు వెబ్‌సైట్‌ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ర్యాన్‌సమ్‌వేర్‌ వైరస్‌ కారణంగా వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయ్యిందన్నారు. ఆంధ్రాబ్యాంక్, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ వెబ్‌సైట్‌లను హ్యాక్‌ చేసిన దుండగులే తమ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసినట్లు భావిస్తున్నామన్నారు. తిరుపతిలో డిస్కంల వెబ్‌సైట్లకు సంబంధించిన డేటా బ్యాకప్‌ ఉందన్నారు.  

బ్యాకప్‌ బాధ్యత టీసీఎస్‌దే.. 
తమ సంస్థ వెబ్‌సైట్‌ నిర్వహణ బాధ్యతలు టీసీఎస్‌ చూస్తోందని, పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదేనని టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సీఎండీ ఎ.గోపాల్‌రావు అన్నారు. ఇప్పటికే వెబ్‌సైట్‌లోని కొన్ని ఆప్షన్లను పునరుద్ధరించామని తెలిపారు. డిస్కంల వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురికావడంపై హైదరాబాద్‌ నగర సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 65 కింద గుర్తుతెలియని హ్యాకర్లపై కేసు నమోదు చేశామని సీసీఎస్‌ అదనపు డీసీపీ రఘువీర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు