ఏడాదికో అకౌంటెంట్‌ మార్పు..! 

26 Nov, 2018 02:09 IST|Sakshi

తరచూ సీఏలను మార్చిన హీరా గ్రూప్‌ 

ప్రతి కొత్త ప్రాజెక్టుకూ తెరపైకి ఒకరు 

షార్జా టీ–10 లీగ్‌ లావాదేవీలపై ఆరా

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే వ్యాపార రంగంలో ఉన్న కంపెనీలు... ప్రధానంగా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ సాధారణంగా వారి లెక్కలు చూసే చార్టర్డ్‌ అకౌంటెంట్లను (సీఏ) మార్చవు. ఏదైనా తీవ్రమైన ఇబ్బంది వస్తే తప్ప కనీసం ఐదేళ్ల వరకు ఒకరినే కొనసాగిస్తుంటారు. అయితే హీరా గ్రూప్‌ వ్యవహారశైలి మాత్రం దీనికి భిన్నం. తమ గ్రూప్‌లో దాదాపు 15 కంపెనీలు ఉన్నప్పటికీ ప్రతి ఆర్థిక సంవత్సరం సీఏలను మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గ్రూప్‌ సీఈఓ నౌహీరా షేక్‌ ఆలోచనల మేరకు ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ఏటా రూ.800 కోట్ల టర్నోవర్‌ ఉందంటూ చూపించి, వివిధ స్కీముల కింద సాలీనా 36 నుంచి 46 శాతం వడ్డీ పేరుతో నౌహీరా షేక్‌ దేశ వ్యాప్తంగా అనేక మంది నుంచి డిపాజిట్లు సేకరించింది. నౌహీరా షేక్‌ 2010–11లో హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ నౌహీరానే నేతృత్వం వహిస్తున్నారు. తన వ్యాపార లావాదేవీలకు సంబంధించి నౌహీరా షేక్‌ ఏ విభాగానికీ సరైన రికార్డులు సమర్పించలేదు.

అయినప్పటికీ ఈమెపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్‌ పోలీసులు అనేక మార్గాల్లో కీలక సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్‌ వార్షిక టర్నోవర్‌ ఆరేళ్ళల్లో కొన్ని వందల రెట్లు పెరిగిందని గుర్తించారు. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్‌ టర్నోవర్‌... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. అయితే వీటికి ఆమె లెక్కలు చూపించలేదని అధికారులు చెప్తున్నారు. ఆయా కంపెనీల లావాదేవీలు, వాటికి చెందిన డాక్యుమెంట్లను హీరా కనీసం ఐటీ విభాగానికీ, ఆర్వోసీకి సమర్పించలేదని పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ ఏళ్ళుగా నౌహీరా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారాల్లో సీఏలది కీలక పాత్రగా ఉంటుందని, వారిని ప్రశ్నిస్తే కొన్ని చిక్కుముడులు వీడతాయని భావించిన సీసీఎస్‌ పోలీసులు వివిధ రికార్డుల నుంచి వారి వివరాలు సేకరించారు. ఇప్పటి వరకు ముగ్గురిని ప్రశ్నించినా ఆశించిన ఫలితం కాలేదు. ఓ వ్యక్తిని సీఏగా నియమించుకోవడం, సంస్థ లావాదేవీలపై అతడికి పూర్తి అవగాహన వచ్చేలోగానే తీసేస్తున్నట్లు సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ గ్రూప్‌లో పని చేసిన సీఏల వివరాలను ఆరా తీయడంపై దృష్టి పెట్టారు.  

గతేడాది షార్జాలో ‘టీ–10’ లీగ్‌ 
క్రీడా రంగంలో కొన్నేళ్ల క్రితం వచ్చిన ‘క్రికెట్‌ టీ–20’ మ్యాచ్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటి నేపథ్యంలో కొన్ని ఫ్రాంచైజీలు కూడా పుట్టుకు వచ్చి భారీ ఆర్థిక లావావేలకు కేంద్రంగా మారి నిర్వహణ సంస్థలకు కాసులు కురిపించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హీరా గ్రూప్‌ మరో అడుగు ముందుకు వేసింది. ‘టీ–10’లీగ్‌ మ్యాచ్‌ పేరుతో కొత్త ఒరవడికి నాంది పలికింది. దీని ప్రకటన, లాంచింగ్‌ గతేడాది డిసెంబర్‌ తొలి వారంలో హైదరాబాద్‌లోనే జరిగింది. ప్రధానంగా హీరా గ్రూప్‌తోపాటు మరికొన్ని సంస్థలూ స్పాన్సర్‌ చేసిన ఈ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఉన్న షార్జా స్టేడియంలో గతేడాది డిసెంబర్‌ 14 నుంచి 17 వరకు జరిగింది. పంజాబీ లెజెండ్స్, ఫక్తూన్స్, మరాఠా అరేబియన్స్, బెంగాల్‌ టైగర్స్, టీమ్‌ శ్రీలంక క్రికెట్, కేరళ కింగ్స్‌ అనే ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. అనేక మంది బాలీవుడ్‌ తారలు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌ల నిర్వహణ, స్పాన్సర్‌ షిప్‌ తదితరాల్లో భారీ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిపై ఆరా తీయాలని నిర్ణయించుకున్నారు. నౌహీరా షేక్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశాక ఇక్కడ బెయిల్‌ మంజూరైంది. బయటకొచ్చిన ఆమెను ముంబై పోలీసులు అరెస్టు చేసి అక్కడకు తరలిం చారు. కొన్ని రోజుల క్రితమే ఇక్కడ మంజూరైన బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. నౌహీరాను ముంబై నుంచి పీటీ వారెంట్‌పై తీసుకురావాలని సీసీఎస్‌ పోలీసులు భావిస్తున్నారు. దీనికి అవసరమైన న్యాయపరమైన సన్నాహాలు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు