వెంకన్నకే శఠగోపం

24 Apr, 2019 07:43 IST|Sakshi

హిమాయత్‌నగర్‌ టీటీడీ కల్యాణమండపాన్ని సీజ్‌ చేసిన తిరుమల విజిలెన్స్‌ అధికారులు

లీజు గడువు ముగిసినా దర్జాగా కొనసాగిస్తున్న వైనం

దాదాపు రూ.కోటి బకాయి  

కల్యాణమండపాన్ని పెళ్లిళ్లకు ఇవ్వడం లేదని ఫిర్యాదులు

హిమాయత్‌నగర్‌: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుసంధానంగా ఉన్న కల్యాణ మండపాలు వ్యాపార సముదాయాలకు కేరాఫ్‌గా మారాయి. ధనాపేక్షతో టీటీడీ అధికారులు సాక్షాత్తు వెంకన్నకే శఠగోపం పెడుతున్నారు. వారికి లీజుకు ఇచ్చిన మండపాల్లో పెళ్లిళ్లు నిర్వహించకుండా ప్రైవేటు వ్యాపారాలకు అద్దెకు ఇస్తున్నారు. టీటీడీకి కట్టాల్సిన బకాయిలు సైతం చెల్లించకపోవడం పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఆగ్రహానికి గురైంది. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని టీటీడీ కల్యాణ మండపం లీజు గడువు ముగిసినా లీజుదారులు దానిని ఖాళీ చేయకుండా పాత కోర్టు ఆర్డర్‌ను చూపిస్తూ అధికారులను ఇబ్బంది పెడుతున్నాడు. గత ఆరు నెలలుగా టీటీడీకి ఒక్క రూపాయి చెల్లించకపోగా నిబంధనలకు విరుద్ధంగా కల్యాణ మండపాన్ని నిర్వహిస్తున్నందుకు గాను దానిని సీజ్‌ చేశారు.  

దాదాపు రూ.కోటి బకాయిలు
ప్రస్తుతం టీటీడీలోని కళ్యాణమండపం ఎస్‌.వైష్ణవి పేరుతో కొనసాగుతోంది. 2016 అక్టోబర్‌న లీజుకు తీసుకున్నారు. 2018 అక్టోబర్‌తో లీజు గడువు ముగిసినా ఖాళీ చేయడం లేదు. దీంతో తిరుపతి నుంచి వచ్చిన అధికారులు మండపాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అదే రోజు లైసెన్సుదారుడు కోర్టుకు వెళ్లి ఎక్స్‌టెన్షన్‌ కోరుతూ స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నాడు. అయితే ఇప్పటి వరకు లీజును పొడిగిస్తున్నట్లు కానీ..లీజు ముగిసిన నాటి నుంచి నేటి వరకు టీటీడీకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో దాదాపు రూ.కోటి వరకు బకాయిపడినట్లు టీటీడి విజిలెన్స్‌ అధికారులు పేర్కొన్నారు.

వ్యాపార సంస్థలకే ప్రాధాన్యం:పెళ్లిళ్ల కోసం మాత్రమే టీటీడీ కల్యాణ మండపాలను నిర్మిస్తోంది. అయితే కల్యాణమండపాన్ని లీజుకు ఇచ్చే సమయంలోనే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అయితే హిమాయత్‌నగర్‌ టీటీడీలో మాత్రం కథ భిన్నంగా ఉంది. లీజు దారుడు పెళ్లిళ్లకు మండపాన్ని ఇవ్వకుండా వ్యాపార సంస్థలు, ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు కేటాయిస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. లీజు దారుడి వ్యవహరశైలిపై టీటీడీ ఉద్యోగులు విజిలెన్స్‌ అధికారులకు సమచారం అందించడంతో ఈ నెల 22న విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. గడువు ముగిసినందున మండపాన్ని స్వాధీనం చేసుకుంటున్నామంటూ మండపాన్ని సీజ్‌ చేశారు. ఈ విషయంపై తిరుమల విజిలెన్స్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో వివరణ కోరగా..‘ఇటువంటి విషయాలు బయట పెట్టకూడదని, నిదానంగా అన్నీ సర్దుకుంటాయని బదులిచ్చారు’.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు