మిర్యాలగూడలో భారీ కుంభకోణం: వందలకోట్లు ఎగవేత

22 Sep, 2019 14:40 IST|Sakshi

మిర్యాలగూడ కేంద్రంగా నకిలీ జీఎస్టీ బిల్లులు

జీఎస్టీ విజిలెన్స్‌ అదుపులో ఇద్దరు నిందితులు

సాక్షి, నల్గొండ: జిల్లాలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. తవుడు రవాణా పన్ను కట్టకుండా నకిలీ బిల్లులు సృష్టించి జీఎస్టీ పన్ను ఎగవేస్తున్న వారి బాగోతాన్ని కేంద్ర విజిలెన్స్‌ అధికారులు బయటపెట్టారు. ఈ మేరకు పలువురు నిందితులపై ఆదివారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆసియా ఖండంలోనే అత్యధిక రైస్ మిల్లులు ఉన్న ప్రాంతంగా పేరుగాంచిన మిర్యాలగూడలో రైస్‌ మిల్లర్లు వందల కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. ధాన్యాన్ని బియ్యంగా మార్చే సమయంలో వెలువడే తవుడును అప్పనంగా బుక్కేందుకు అక్కడి కమిషన్ ఏజెంట్లు, రైస్ మిల్లర్లు నకిలీ బిల్లుల దందాకు తెరలేపారు.

తవుడును పశువుల దానా, ఆయిల్ మిల్లులకు సరఫరా చేసేందుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 5% జిఎస్టీ ని చెల్లించకుండా నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. ఇలా సంవత్సరానికి రూ.80 కోట్ల పన్ను తప్పించుకుంటూ ఇప్పటివరకు వందల కోట్ల పన్నులను ఎగ్గొట్టారు. దీంతో ఢిల్లీ, విశాఖపట్నం నుంచి జీఎస్టీ విజిలెన్స్‌ అధికారులు ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగి రెండు రోజులుగా మిర్యాలగూడ రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. వందల కోట్ల ప్రభుత్వ పన్నును ఎగవేసినట్టుగా అధికారులు గుర్తించగా పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ జీఎస్టీ బిల్లులు సృష్టించి భారీగా ప్రభుత్వ సొమ్మును కాజేసిన నిందితులపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు