గర్భిణిపై దాష్టీకం

4 Dec, 2018 13:15 IST|Sakshi

అదనపు కట్నం కోసం మూకుమ్మడి దాడి

మెట్టినింటి వారి అఘాయిత్యం

గర్భం కోల్పోయిన బాధితురాలు

కర్నూలు, నంద్యాల: ఎన్నో ఆశలతో పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లిన ఆమెకు ఏడాది తిరక్కముందే వేధింపులు మొదలయ్యాయి. మూడు నెలల గర్భం దాల్చినా వేధింపులుకట్నం తేకుంటే ఆపరేషన్‌ చేయించుకోవాలని ఒత్తిడి పెంచారు. ఆపరేషన్‌కు ససేమిరా అనడంతో భర్త, అత్త, మామ, మరిదులు మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో ఆమె గర్భం కోల్పోయింది. టూటౌన్‌ సీఐ మంజునాథరెడ్డి తెలిపిన మేరకు పూర్తి వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన సాయిసురేఖకు గత ఏడాది ఆగస్టులో ప్రకాశం జిల్లా కొమరోలు మండల కేంద్రానికి చెందిన వెంకటేష్‌తో వివాహమైంది. వివాహ సమయంలో రూ.1.60 లక్షల నగదు, రూ.2.40 లక్షల విలువ చేసే బంగారంకట్నంగా ఇచ్చారు.

పెళ్లయి కొన్ని నెలలు కూడా గడవకముందే అత్తింటి వారి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. రూ.10 లక్షలు తీసుకొని రావాలంటూ చిత్రహింసలకు గురి చేశారు. దీంతో బాధితురాలు పుట్టింటికి వచ్చి విషయం తల్లిదండ్రులకు తెలిపింది. పెద్దలు ఇరు కుటుంబాలను పిలిపించి పంచాయితీ చేశారు. కొద్ది సమయం ఇస్తే డబ్బు ఇస్తామని బాధితురాలి తల్లిదండ్రులు సర్దిచెప్పి పంపారు. ఆ తర్వాత సాయిసురేఖ గర్భం దాల్చింది. పిల్లలు పుడితే ఇక డబ్బులివ్వరన్న ఉద్దేశంతో మళ్లీ వేధింపులు మొదలుపెట్టారు. పిల్లలు కనడానికి వీల్లేదని, వెంటనే ఆపరేషన్‌ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో భర్త వెంకటేష్, మామ సింహాచలం, అత్త గంగ, మరిదులు రమేష్, సుదర్శన్, మేనత్త కలిసి మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో బాధితురాలు పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులకు విషయం తెలిపింది. వెంటనే వారు నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్ష చేయించారు. పిండం దెబ్బతినిందని, ఆపరేషన్‌ చేయకపోతే ఇబ్బంది అవుతుందని తెలిపారు. దీంతో వెంటనే ఆపరేషన్‌ చేయించారు. అలాగే ఈ విషయంపై సోమవారం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి భర్త, అత్త, మామ, మరిదులు, మేనత్తపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మంజునాథరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు