ఒక ఆటో..70 సీసీ కెమెరాలు

2 Sep, 2019 09:04 IST|Sakshi
సీసీ ఫుటేజిలో బాలిక ప్రయాణించిన ఆటో

బాలిక అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ

సీసీ పుటేజీ ఆధారంగా ఛేదన

బంజారాహిల్స్‌:  సీసీ ఫుటేజీ ఆధారంగా అదృశ్యమైన ఓ బాలికను జూబ్లీహిల్స్‌ పోలీసులు గుర్తించి తల్లికి క్షేమంగా అప్పగించారు. ఎస్‌ఐ శివశంకర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫతేనగర్‌కు చెందిన వైష్ణవి(12) యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. ఆమె తల్లి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–5లోని నారాయణ స్కూల్‌లో ఆయాగా పనిచేసేది. శుక్రవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన వైష్ణవి తన తమ్ముడితో కలిసి స్కూల్‌ అయిపోయిన తర్వాత తల్లి వద్దకు వచ్చి ఆడుకుంటుండగా సరిగ్గా చదవడం లేదంటూ అనురాధ ఆమెను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన వైష్ణవి ఓ పేపర్‌పై తాను చనిపోయిన తండ్రి వద్దకు వెళుతున్నానని, నువ్వు అక్కర్లేదంటూ తల్లికి లేఖ రాసి తమ్ముడి చేతికి ఇచ్చి వెళ్లిపోయింది. దీంతో ఆందోళన చెందిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైష్ణవి కోసం గాలింపు చేపట్టారు.

బాలికను తల్లికి అప్పగిస్తున్నజూబ్లీహిల్స్‌ పోలీసులు
బాలిక నడుచుకుంటూ యూసుఫ్‌గూడ వైపు వెళుతూ శ్రీకృష్ణానగర్‌ మోర్‌ సూపర్‌మార్కెట్‌ వద్ద ఆటో ఎక్కినట్లు గుర్తించారు. ఆటో ముందు గ్రీన్‌కలర్‌ బోర్డు ఉండటంతో దీని ఆధారంగా  దర్యాప్తు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో ఓ ఆటో డ్రైవర్‌ ఆటోను గుర్తించి ఫిలింనగర్‌కు చెందినదిగా చెప్పడంతో  ఫిలింనగర్‌ వైపు నుంచే వచ్చే ఆటోలపై నిఘా వేశారు. మరో 8 గంటలు కష్టపడితే ఎట్టకేలకు ఆ ఆటో కనిపించింది. ఆ రోజు సాయంత్రం మోర్‌ సూపర్‌మార్కెట్‌ వద్ద ఓ బాలిక ఆటో ఎక్కి సారథి స్టూడియో వద్ద దిగి సందులోంచి నడుచుకుంటూ వెళ్లిందని చెప్పాడు. అటు వైపు ఎవరున్నట్లు తల్లిని ప్రశ్నించగా తన అత్త ఉంటుందని చెప్పింది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి ఆరా తీయగా ఆమె అక్కడికి రాలేదని ఫతేనగర్‌లో ఉంటున్న ఆమె బాబాయి ఇంటికి వెళ్లి ఉండవచ్చునని చెప్పింది. పోలీసులు శనివారం రాత్రి  ఫతేనగర్‌ వెళ్లి వైష్ణవి బాబాయిని కలిసి విషయం చెప్పగా శుక్రవారం రాత్రి తమ వద్దకే వచ్చిందని చెప్పడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. బాలికను స్టేషన్‌కు తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. శ్రీకృష్ణానగర్‌ నుంచి సారథి స్టూడియో వరకు, ఇటు ఫిలింనగర్‌ వైపు 70కిపైగా సీసీ ఫుటేజ్‌లను పరిశీలించగా ఈ ఆటో చాలా చోట్ల కనిపించిందని దీంతో మిస్టరీ ఛేదించినట్లు పోలీసులు వివరించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు