రేపిస్ట్‌కు మరణశిక్ష : రికార్డ్‌ టైంలో తీర్పు

12 May, 2018 17:08 IST|Sakshi

సాక్షి, ఇండోర్‌: దేశంలోనే  అతి వేగవంతమైన తీర్పును ఇండోర్‌ జిల్లా కోర్టు వెలువరించింది.  పసిగుడ్డుపై హత్యాచారానికి  పాల్పడ్డ ఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు  ఈ సంచలన తీర్పునిచ్చి రికార్డు సృష్టించింది.   కేసు నమోదైన  కేవలం 23 రోజుల్లోనే ముద్దాయికి మరణ శిక్షను విధించింది.   మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గత నెలలో నాలుగు నెలల పసిపాపను అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన  ఉదంతంలో  నవీన్‌ గడ్కే (21) కి శనివారం జిల్లా కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. ఈ  కేసును  చాలా అరుదైన కేసుగా పరిగణించి, ముద్దాయికి మరణశిక్ష విధించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్రమ్ షేక్ కోర్టును కోరారు.  దీనికి  సానుకూలంగా స్పందించిన సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వర్ష శర్మ.. ఏడవడం  తప్ప ఏమీ తెలియని పసిపాపపై  ఇది అమానుష చర్య అని  వ్యాఖ్యానించారు. 

ఏప్రిల్‌ 20న ఇండోర్ నగరంలోని రాజ్‌వాడా ఫోర్ట్‌ సమీపంలో  త‌ల్లిప‌క్క‌నే నిద్రిస్తున్న  అభం శుభం తెలియ‌ని  నాలుగు నెల‌ల ప‌సికందును ఎత్తుకెళ్లిన  నవీన్‌ అత్యాచారం చేసి అనంత‌రం హ‌త్య చేయడం కలకలం రేపింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఏప్రిల్  21న  నిందితుడిని అరెస్టు చేశారు.  కాగా  కథువా, ఉన్నావ్‌ తదితర ఘటనల నేపథ్యంలో సీరియస్‌గా స్పందించిన కేంద్ర ప్రభుత్వం  పన్నెండేళ్లలోపు  వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష విధించే ఆర్డినెన్స్‌ను ఇటీవల ఆమోదించింది. దీనికి  రాష్ట్రపతి  రామ్‌నాథ్ కోవింద్  సమ‍్మతించిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు