విద్యార్థి ఆయువు తీసిన ఆర్థిక కష్టాలు

3 Jun, 2020 12:01 IST|Sakshi

లారీ క్లీనర్‌గా మారిన ఇంటర్‌ విద్యార్థి

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

మృతుడిది వైఎస్సార్‌ జిల్లా

వైఎస్సార్‌ జిల్లా, మార్టూరు: బతుకుదెరువు కోసం లారీ క్లీనర్‌గా మారిన ఇంటర్‌ విద్యార్థి మార్గం మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన స్థానిక జాతీయ రహదారిపై ఇసుక దర్శి (ప్రకాశం జిల్లా) సమీపంలో మంగళవారం వేకువ జామున 4 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసులు, హైవే అంబులెన్స్‌ సిబ్బంది కథనం ప్రకారం.. కడపలోని గౌస్‌ నగర్‌కు  చెందిన వెంకట్‌ (18) ఇంటర్‌ చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వెంకట్‌  సోమవారం రాత్రి కడప నుంచి విజయవాడ వెళ్లే టమాటా లారీలో క్లీనర్‌గా బయల్దేరాడు.

స్థానిక ఇసుక దర్శి సమీపంలో అతడు ప్రయాణిస్తున్న లారీకి ముందు వెళ్తున్న మరో లారీ అకస్మాత్తుగా ఆగింది. దీంతో వెనుక లారీ బలంగా ఢీకొంది. ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు  స్వల్ప గాయాలుకాగా.. క్యాబిన్‌లో కూర్చున్న వెంకట్‌ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్‌ సిబ్బంది అతడిని లారీ నుంచి అతికష్టం మీద బయటకు తీస్తుండగా మృతి చెందాడు. ఎస్‌ఐ శివకుమార్‌ తన సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు