లాక్‌డౌన్‌ : బిలియనీర్ల విందు, ఉన్నతాధికారిపై వేటు

10 Apr, 2020 10:27 IST|Sakshi
వ్యాపారవేత్తలు, కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్

లాక్‌డౌన్‌ను అతిక్రమించిన  వ్యాపారవేత్తలు  అరెస్ట్

అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న కపిల్, ధీరజ్ వాధ్వాన్

ఫామ్‌హౌస్‌ లో పార్టీ, వీరిలో ఇటలీకి చెందిన బాడీగార్డు

స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు  

23 మందిపై  కేసు,  క్వారంటైన్

సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు బిలియనీర్లు కపిల్ వాధ్వాన్,  ధీరజ్ వాధ్వాన్ లను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా -19 లాక్‌డౌన్‌ నిబంధలను ఉల్లంఘించి, మహారాష్ట్ర హిల్ రిసార్ట్‌లోని వారి ఫామ్‌హౌస్‌ లో విందు చేసుకుంటున్న వీరిని అరెస్ట్ చేశారు. అంతేకాదు వీరికి అక్కడికి వెళ్లేందుకు అనుమతిచ్చిన ఐఎఎస్ అధికారిపై వేటు వేశారు.

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలందరూ భౌతికదూరాన్నిపాటిస్తోంటే, వీరు మాత్రం కుటుంబ సభ్యులతో మహాబలేశ్వర్‌లోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. ఆరు హై-ఎండ్ వాహనాలను గుర్తించిన స్థానికులు వెంటనే మునిసిపల్ అధికారులకు తహశీల్దార్ కు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇద్దరు డిహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లతో సహా మొత్తం 23 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అత్యవసరం పరిస్థితి పేరుతో పాస్లు జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అమితాబ్ గుప్తాను బలవంతపు సెలవుపై పంపారు. 

వీరు తన కుటుంబ స్నేహితులనీ, కుటుంబ అత్యవసర పరిస్థితుల నిమిత్తం ఖండాలా నుండి మహాబలేశ్వర్ వరకు వెళ్లేందుకు అనుమతించాలంటూ అమితాబ్ గుప్తా పాసులు జారీ చేశారు. దీంతో వీరంతా బుధవారం రాత్రి ఐదు కార్లలో ముంబైకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నఫామ్‌హౌస్‌ తరలివెళ్లారు. వాధ్వాన్ల వంటవారు, సేవకులు ముఖ్యంగా కరోనా వైరస్ సంక్షోభంలో అత్యంత ప్రభావితమైన దేశం ఇటలీకి చెందిన వాధ్వాన్ బాడీగార్డ్ ఇందులో వుండటం గమనార్హం. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు వీరందరిపైనా  కేసు నమోదు చేశారు. వీరిని క్వారంటైనకు తరలించామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం)

మరోవైపు  పీఎంసీ  బ్యాంకు కుంభకోణం సహా, పలు అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు, కపిల్, ధీరజ్ వాధ్వాన్ మీద సీబీఐ లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి. గత నెలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా, మూడుస్లారు నిందితులు తప్పించుకున్నారు. అయితే క్వారంటైన్ గడువు ముగిసిన తర్వాత వారిని అదుపులోకి తీసుకోవాలని సీబీఐ భావిస్తోంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తుందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ట్విటర్ ద్వారా  వెల్లడించారు. 

మరిన్ని వార్తలు