చనిపోయినట్లు నటించి బతికిపోయా

25 Feb, 2018 05:25 IST|Sakshi
ఆస్పత్రిలో కోలుకుంటున్న లావణ్య.....దాడి జరగకముందు లావణ్య (ఫైల్‌)

ప్రాధేయపడినా దారుణంగా దాడిచేశారు

మహిళల రక్షణపై ప్రచారం చేస్తా

చెన్నైలో దుండగుల దాడికి గురైన టెక్కీ లావణ్య వెల్లడి

సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ ఆ దుండగులు ఏ మాత్రం దయాదాక్షిణ్యం లేని వారిగా వ్యవహరించారు, మీక్కావాల్సిన వస్తువులన్నీ తీసుకోండి..నన్ను మాత్రం ప్రాణాలతో వదిలేయండి అని ప్రాధేయపడినా పట్టించుకోలేదు...చనిపోయినట్లు నటించకుంటే నిజంగా చంపేసేవారు..’ అని ఆంధ్రప్రదేశ్‌ విజయవాడకు చెందిన టెక్కీ లావణ్య పోలీసుల వద్ద తన ఆవేదనను వ్యక్తం చేశారు. కేసు విచారణ చేపట్టిన పల్లికరణై పోలీసులు ఆమె వద్ద వీడియో ద్వారా వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. గుండెను పిండేసేలా చోటుచేసుకున్న ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 
                
చెన్నైలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్న లావణ్య ఈనెల 12వ తేదీన తన కార్యాలయ విధులను ముగించుకుని బైక్‌లో ఇంటికి వెళుతుండగా చెన్నై శివారు పెరుంబాక్కంలో ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. వారిలో ఒకడు నా చేతికి తొడుక్కొని ఉన్న బంగారు బ్రాస్‌లెట్‌ను లాక్కునేందుకు ప్రయత్నించారు. వెంటనే నేనే ఇస్తాను అన్నా వినిపించుకోలేదు. ఎంతో టైట్‌గా ఉన్న బ్రాస్‌లైట్‌ను బలవంతంగా లాగడంతో విలవిలలాడిపోయాను. నన్నేమీ చేయకండి అని కోరాను. అయితే వాళ్లు వినిపించుకోలేదు.

వారితో నేను వాగ్వాదానికి దిగడంతో వెనక నుంచి ఒకడు ఇనుప కమ్మితో నా తలపై బలంగా కొట్టాడు. తల నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుండగా బైక్‌ నుంచి కిందపడి పోయాను. తల, చేతులు, గుండెపై రాడ్డుతో, చేతులతో పిడిగుద్దులు కురిపించారు. ఇక వీరి నుంచి ఎలాగైనా బైటపడాలని చనిపోయినట్లు నటించాను. చనిపోయాననుకుని వారు పారిపోయారు. రెండు గంటల పాటు రక్తపు మడుగులో ప్రాణాల కోసం పోరాడాను. ఎవరూ సహాయానికి రాని పరిస్థితుల్లో మానసిక స్థైర్యాన్ని గుండెల్లో నింపుకున్నా.

రక్తం కారుతున్న స్థితిలో నేను మనోధైర్యాన్ని కూడగట్టుకుని లేచి నిల్చొని ఎదురుగా కొత్తగా కడుతున్న నిర్మాణంలోకి నడిచి వెళ్లాను. కొంచెంసేపైన మరలా నిలదొక్కుకుని జనసంచారం ఉన్న చోటకు వెళితే సహాయం లభిస్తుందని బయల్దేరాను, మా నాన్న ఇప్పటికే ఒక కుమార్తెను పోగొట్టుకున్నారు. నేను కూడా ఆయనకు దూరం కాకూడదని మొండి ధైర్యం తెచ్చుకోవడంతో రక్తం కారుతున్నా నొప్పులు తెలియలేదు.

సుమారు రెండు గంటల తర్వాత ఒక వాహనంలో వెళుతున్న వ్యక్తుల ద్వారా ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చేర్పించారు. నేను ఎటువంటి ఆధారాలు చూపకున్నా నిందితులను రెండోరోజుల్లోనే పట్టుకున్న తమిళనాడు పోలీసులు ప్రశంసనీయులు. ముఖ్యంగా నేను కోలుకునేందుకు రేయింబవళ్లు పాటుపడిన పళ్లికరణై ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌కు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక పల్లికరణై ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ను మా కుటుంబంలో ఒక వ్యక్తిగా స్వీకరించాం. తమిళనాడు ప్రజలు నా కోసం చేసిన ప్రార్థనలే నన్ను బ్రతికించాయి.

పోలీసులు వచ్చి నిందితులను ఫొటోలు చూపించి గుర్తించమని కోరారు. అయితే నేను వారి ముఖాలను చూసేందుకు ఇష్టపడలేదు. నా జీవితంలో వాళ్లను మరోసారి చూడకూడదని, జ్ఞాపకంలోకి కూడా రాకూడదని నిర్ణయించుకున్నా. దారిదోపిడీకి పాల్పడే నేరస్థులను పట్టుకుని దండించే పోలీసులు వారి ఫొటోలను ప్రజల్లో బహిరంగంగా ప్రకటించాలి. నాకు జరిగిన నష్టంతో నా మనసులో ఇలాంటి చైతన్య ప్రచారాల పథకాలు మెదలుతున్నాయి. పూర్తిగా కోలుకున్న తర్వాత తమిళనాడు పోలీసుల సహకారంతో మహిళల రక్షణ కోసం అనేక పథకాలను అమలు చేయాలని, చైతన్యం కల్పించాలని ఉంది.

 

మరిన్ని వార్తలు