మత్తుమందు, దొంగతనం, ఆపై అత్యాచారం..

19 Nov, 2019 14:33 IST|Sakshi
(ఫొటో కర్టసీ: ఐదివా..) పోలీసుల అదుపులో నిందితుడు

భోపాల్‌: కొన్ని సినిమాలు నేరగాళ్లకు ప్రేరణగా నిలుస్తున్నాయి. తప్పు చేసి తప్పించుకోవడమెలా అనేవాటిని కేటుగాళ్లకు సులువుగా నేర్పిస్తున్నాయి. తాజాగా భోపాల్‌లో వెలుగు చూసిన ఘటనే ఇందుకు నిదర్శనం..! వివరాలు.. భోపాల్‌లోని జలంధర్‌కు చెందిన సిమ్రన్‌ సింగ్‌ నిరుద్యోగులను టార్గెట్‌ చేస్తూ డబ్బు సంపాదించేవాడు. పైకి హుందాగా కనిపిస్తూ అలవోకగా ఇంగ్లిష్‌ మాట్లాడుతూ నిరుద్యోగులను బుట్టలో పడేశాడు. స్వదేశంలోనైనా, విదేశంలోనైనా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదంటూ మాయమాటలు చెప్పేవాడు.

ఇంటర్వ్యూల పేరిట హోటల్‌కు పిలిచి మత్తుమందు కలిపిన టీ, కాఫీ ఇచ్చి స్పృహ తప్పిపోగానే తన అసలు స్వరూపం చూపిస్తాడు. నగదు, నగలు ఇలా అందినకాడికి దోచుకుంటాడు. దేశంలోని ఎనిమిది నగరాల్లో 30కి పైగా అతని బాధితులు ఉన్నారు. ముంబైకి చెందిన రాజేంద్ర గుణేకర్‌కు ‘యూరోపియన్‌ వర్క్‌ వీసా’ ఇప్పిస్తానని భోపాల్‌కు రప్పించి బురిగడీ కొట్టించాడు. అతనికి మత్తుమందు ఇచ్చి రూ.2 లక్షల నగదు, గోల్డ్‌ రింగ్‌తో ఉడాయించాడు. అదే నగరానికి చెందిన పెట్రోకెమికల్‌ ఇంజనీర్‌, అతని మిత్రడికి కూడా మత్తుపదార్థాలు ఇచ్చి వారి ఏటీఎమ్‌లను దొంగిలించి రూ.2 లక్షలు విత్‌డ్రా చేసుకున్నాడు. భోపాల్‌లోని ఓ కల్నల్‌ దగ్గరనుంచి రూ.7 లక్షలకు పైగా దోచుకున్నాడు.

ఇక అతని బాధితుల లిస్టులో మహిళల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. ముంబైకు చెందిన ఓ మహిళను మధ్యప్రదేశ్‌కు రప్పించి ఆమె దగ్గర రూ.2 లక్షలు దొంగిలించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పోలీసులకు దొరక్కుండా దృశ్యం సినిమాను తలెదన్నేలా ఎత్తులు వేశాడు. ఎప్పటికప్పుడు సిమ్‌కార్డులు మార్చుతూ, నేరం చేసిన తర్వాత బాధితుల ఫోన్లను దొంగిలించి ట్రైన్లు, బస్సుల నుంచి విసిరేసి ఆధారాలు లేకుండా చేసేవాడు.

అయితే ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని బండారం బయటపడింది. రంగంలోకి దిగిన భోపాల్‌ పోలీసులు అతని నుంచి ఫేక్‌ ఆధార్‌ కార్డులను, నిద్రమాత్రలను స్వాధీనం చేసుకున్నారు. కొసమెరుపు ఏంటంటే.. సిమ్రన్‌ సింగ్‌ కూడా గతంలో ఈ విధంగానే మోసపోయాడు. అతన్ని కెనడాకు పంపిస్తానని చెప్పి ఓ వ్యక్తి రూ.2.25 లక్షలు తీసుకొని మోసగించాడు. ఆ తర్వాత సిమ్రన్‌ సింగ్‌ ‘పోయిన చోటే వెతుక్కోవాలి’అనే తీరుగా ఈ మోసాలకు తెరతీశాడు.

మరిన్ని వార్తలు