దారి తప్పిన నాయకురాలు

15 Jan, 2018 15:39 IST|Sakshi

ఎన్నికల ఖర్చుల కోసం రియల్టర్‌ కిడ్నాప్‌

రూ.60 లక్షల వసూలు

జేడీఎస్‌ నాయకురాలు అర్షియా సహా నలుగురి అరెస్టు

యలహంక (కర్ణాటక): ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చినవారు సన్మార్గంలో నడుస్తూ ఆదర్శంగా నిలవాలి. అప్పుడే ప్రజలు ఆదరిస్తారు. అయితే ఆమె రూటు మార్చుకుని కటకటాలు లెక్కిస్తున్నారు. వాకింగ్‌కు వెళ్లిన మాజీ నగర సభ సభ్యుడు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మల్లికార్జునప్పను కిడ్నాప్‌ చేసి రూ 60 లక్షలు నగదును తీసుకోని విడిచిపెట్టిన నలుగురు నిందితులను ఈశాన్య విభాగం పోలీసులు అరెస్టు చేశారు. జేడిఎస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్రాధ్యక్షురాలు అర్షియా ఆలీ ఈ కేసులో పట్టుబడడం విశేషం. రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు అవసరమని ఆమె అపహరణ మాస్టర్‌ ప్లాన్‌ వేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు యలహంక సమీపంలోని మారుతీ నగరలో నివాసముండే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మల్లికార్జునప్ప ఈ నెల 11వ తేదీ ఉదయాన్నే జికెవికెలో వాకింగ్‌కని కారులో బయలుదేరాడు.

 

మారణాయుధాలతో బెదిరించి కిడ్నాప్‌
కోగిల్‌ క్రాస్‌లో హెచ్‌బిఆర్‌ లేఔట్‌కు చెందిన కాంతరాజ్‌ గౌడ (30), ప్రసాద్‌ (41, బాగలూరు రోడ్డు), అర్షియా ఆలీ (32, శ్రీనివాసగార్డెన్స్‌), డ్రైవర్‌ ప్రదీప్‌ (27, హొరమావు)లు మల్లికార్జునప్ప కారును అడ్డగించి మారణాయుధాలతో బెదిరించి తమ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. హెణ్ణూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హొరమావులోని ఒక గ్యారేజులో బంధించి, మల్లికార్జునప్ప కుమారుడు డాక్టర్‌ రవికుమార్‌కు కిడ్నాపర్లు ఫోన్‌ చేశారు. మీ తండ్రిని కిడ్నాప్‌ చేశాం, రూ. 100 కోట్లు ఇవ్వాలి, పోలీసులకు ఈ విషయం చెబితే తీవ్ర పరిణామాలుంటాయి అని బెదిరించా రు. పనిపైన హైదరాబాదుకు వెళ్లిన రవికుమార్, తన తండ్రికి ఏ హానీ చేయయద్దని, నగదు తీసుకొస్తానని కిడ్నాపర్లకు హామీ ఇచ్చాడు. తన స్నేహితుల దగ్గర రూ 60 లక్షల నగదు సమకూర్చుకుని బాగేపల్లి సమీపంలోని ముఖ్య రోడ్డులో ఉన్న దేవస్థానంలో రాత్రి సమయంలో నగదు బ్యాగు పెట్టి కొంతదూరంలో ఉన్న తన తండ్రిని పిలుచుకుని ఇంటికి వెళ్లాడు. బంధువులు, స్నేహితుల సలహా మేరకు యలహంక పోలీస్‌ స్టేషన్‌ లో పిర్యాదు చేశాడు.

24 గంటల్లో అరెస్టు
డిసీపి గిరీశ్‌ నాయకత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి కిడ్నాప్‌ చేసిన స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించి వారువాడిన మొబైల్‌ నెంబర్, టవర్‌ ఆధారంగా హొరమావి ప్రాంతాన్ని చూపించడంతో అక్కడ ఉన్న కారు డ్రైవర్‌ ప్రదీప్‌ను పట్టుకున్నారు. ప్రదీప్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం మరో అర్షియా అలీ సహా ముగ్గురుని పోలీసులు నిర్బంధించి ప్రశ్నించగా, తప్పును ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.1.04 కోటి నగదు, 3 లక్షల విలువ చేసే బంగారు నగలు, ఒక పిస్టల్, తూటాలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు