జేఎన్‌యూ విద్యార్థి ఆత్మహత్య

17 May, 2019 20:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : లైబ్రరీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. ప్రొఫెసరుకు ఈ-మెయిల్‌ చేసిన అనంతరం ఘాతుకానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. రిషి థామస్‌ అనే విద్యార్థి జేఎన్‌యూలో ఎంఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి అతడు క్యాంపస్‌లోని మహి మాండ్వీ బాయ్స్‌ హాస్టల్‌లో బస చేస్తున్నాడు. ఈ క్రమంలో తాను చనిపోతున్నానంటూ శుక్రవారం ఇంగ్లీషు ప్రొఫెసర్‌ మెయిల్‌ చేశాడు. అనంతరం యూనివర్సిటీలోని లైబ్రరీలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు.

ఈ విషయం గురించి సౌత్‌వెస్ట్‌ డీసీపీ మాట్లాడుతూ.. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని సఫర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడు ఏదో వ్యాధితో బాధపడుతున్నాడని, అందుకోసం చికిత్స కూడా తీసుకుంటున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.  ప్రొఫెసర్‌కు పంపిన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు