పాడేరు– కామెరూన్‌ వయా బెంగళూరు

7 Dec, 2019 18:45 IST|Sakshi

నకిలీ రూ.2వేల నోట్ల తయారీలోనూ సిద్ధహస్తులు

కడపలో ఐదుగురి అరెస్టు

సాక్షి, కడప: తీగలాగితే డొంక కదిలినట్లు చిక్కింది ఐదుగురు నేరస్తుల ముఠా. స్పందనలో వచ్చిన ఫిర్యా దును తీవ్రంగా పరిగణించి కడప పోలీసులు దర్యాప్తు చేసి దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు. ముఠా వివరాలు వైఎస్సార్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ శనివారం వెల్లడించారు. పోలీసులు నిర్వహించే స్పందనకు కేరళకు చెందిన అబ్దుల్‌ కరీం వాట్సప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. కడప భాగ్యనగర్‌ కాలనీకి చెందిన చింపిరి సాయికృష్ణ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమై ఖరీదైన, నాణ్యమైన విగ్గులను విక్రయిస్తున్నట్లు చెప్పి డబ్బులను కాజేశారనేది సారాంశం. అలాగే సాయికృష్ణ మోసం చేశాడని కడపకు చెందిన జనార్దన్‌  పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సీఐ అశోక్‌రెడ్డి దీనిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ సైబర్‌ నేరాలను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. దర్యాప్తునకు కడప డీఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు.

గుట్టు రట్టు ఇలా: కడప నగరంలో ఒక ప్రయివేట్‌ లాడ్జీలో ఆ ముఠా ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం దాడి చేసి పట్టుకున్నారు. చింపిరి సాయికృష్ణ (కడప), పంగి దాసుబాబు (విశాఖ జిల్లా సిమిలిగూడ), కుర్రా జగన్నాథ్‌ (విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం పెద్దపాడు), కామెరూన్‌ దేశానికి చెందిన ఏంబిఐ అడోల్ప్‌ ఆషు, ఆకో బ్రోన్‌సన్‌ ఎనౌ పోలీసులకు చిక్కిన వారిలో ఉన్నారు. వారి నుంచి 9కిలోల గంజాయి, రూ.9,600 నగదు, రూ.7.28 లక్షల విలువైన నకిలీ రూ.2వేల నోట్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, కలర్‌ ప్రింటర్, ఏడు సెల్‌ఫోన్‌లను స్వా«దీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీ నుంచి గంజాయిని కామెరూన్‌ దేశానికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలుసుకుని పోలీసులు నిర్ఘాంతపోయారు. నకిలీ రూ.2000 నోట్లను కూడా ప్రింట్‌ చేస్తున్నట్లు గుర్తించా రు. పాడేరులో రూ.6వేలకు గంజాయి కొనుగోలు చేసి కామెరూన్‌లో విక్రయిస్తే పదిరెట్లు ఆదాయం వస్తుందని నిందితులు తెలిపారు. ఐదుగురిని అరెస్ట్‌ చేసి పాస్‌పోర్టులను స్వా«దీనం చేసుకున్నామని ఎస్పీ  వివరించారు. 

మరిన్ని వార్తలు