జసిత్‌ కోసం ముమ్మర గాలింపు

25 Jul, 2019 05:15 IST|Sakshi
కిడ్నాపైన జసిత్‌

పోలీసులకు సవాల్‌గా మారిన బాలుడి కిడ్నాప్‌ కేసు 

సీసీ ఫుటేజీలో అనుమానితులు?

బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన కలెక్టర్, ఎస్పీ

నిందితులను పట్టుకుంటామని హామీ

మండపేట: తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బ్యాంకు ఉద్యోగులు నూకా వెంకటరమణ, నాగావళి దంపతుల కుమారుడు నాలుగేళ్ల జసిత్‌ కిడ్నాప్‌ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. బాలుడిని దుండగులు ఎత్తుకెళ్లి రెండు రోజులవుతున్నా దీనిపై ఒక్క క్లూ దొరకలేదు. సోమవారం సాయంత్రం 7 గంటలకు నానమ్మ పార్వతితో కలిసి ఫ్లాట్‌లోకి వెళ్తున్న సమయంలో అపరిచిత వ్యక్తి దాడిచేసి జసిత్‌ను ఎత్తుకెళ్లిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన వెంకటరమణ, నాగావళి దంపతులు ఏడాది క్రితం బదిలీపై మండపేట వచ్చారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్పీ నయీంఅస్మీ కిడ్నాపర్ల కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు డీఎస్పీలు, 10 మంది సీఐల నేతృత్వంలో 500 మంది సిబ్బందితో 17 బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. కేసు పురోగతి సాధించే దిశగా సరైన ఆధారాలు ఏవీ ఇంకా లభ్యం కాలేదు. కిడ్నాపర్ల నుంచి ఎటువంటి ఫోన్‌కాల్స్‌ రాలేదు. కిడ్నాప్‌కు కారణాలు తెలియకపోవడంతో అనుమానితులందరినీ విచారిస్తున్నారు.

ఎలా ఉన్నాడో.. ఎక్కడున్నాడో?
తన బాబు ఎలా ఉన్నాడో.. ఎక్కడున్నాడో? అంటూ జసిత్‌ తల్లి రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుతం ఆమె తొమ్మిదో నెల గర్భిణి. జసిత్‌ రాక కోసం తల్లిదండ్రులు, నానమ్మ పార్వతి నిద్రాహారాలు మాని ఎదురు చూస్తున్నారు. ఎవరితోనూ తమకు విభేదాలు లేవని, బాబును క్షేమంగా అప్పగించండంటూ తల్లిదండ్రులు వెంకటరమణ, నాగావళి కన్నీటి పర్యంతమవుతున్నారు. 

ముసుగు ధరించిన వ్యక్తిపై అనుమానాలు
కాగా, ఈనెల 3న ముసుగు ధరించిన అపరిచిత వ్యక్తి ఫ్లాట్‌ అద్దెకు కావాలంటూ రోజూ పిల్లలతో కలిసి జసిత్‌ ఆడుకునే ఇంటి వద్ద అడగడం అనుమానాలకు తావిస్తోంది. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజీని భవన యజమాని కురుపూడి రామకృష్ణ పోలీసులకు అందజేశారు. ఆగంతకుడికి తోడుగా వచ్చిన మరోవ్యక్తి హెల్మెట్‌ ధరించి ఉన్నట్టు గుర్తించారు. పక్కాగా రెక్కీ నిర్వహించి కిడ్నాప్‌ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానిత వ్యక్తులను కనుగొనేందుకు ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది. బుధవారం కలెక్టర్‌ మురళీధరరెడ్డి మండపేట వచ్చి జసిత్‌ తల్లిదండ్రులను సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తుపై ఎస్పీతో చర్చించారు. నిందితులను పట్టుకొని బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించేందకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు