కిడ్నాప్‌ కేసులో దస్తగిరి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కేసులో దస్తగిరి అరెస్ట్‌

Published Wed, Nov 1 2023 3:59 AM

Dastagiri arrested in kidnapping case - Sakshi

ఎర్రగుంట్ల:  వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని పోలీసులు ఓ కిడ్నాప్‌ కేసు వ్యవహారంలో అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు మరో నలుగురిపై కిడ్నాప్‌ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం వైఎస్సార్‌ జిల్లా యర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌లో జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు మీడియాకు తెలిపారు.

వేర్వేరు కులాలకు చెందిన ఇమాంబీ, లక్ష్మీనారాయణ డిగ్రీ చదువుతోన్న సమయంలో ప్రేమించుకున్నారు. తల్లిదండ్రు­లు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో లక్ష్మీనారాయణతో కలిసి ఇమాంబీ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసి «విచారణ చేపట్టిన అనంతరం ఇమాంబీని సీఐ ఈశ్వరయ్య తహశీల్దార్‌ ఎదు­ట ప్రవేశపెట్టారు.

ఇమాంబీ వయసు 18, లక్ష్మీనారాయణ వయసు 21 కావడంతో ఇమాంబీని తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఇమాంబీ తల్లిదండ్రులు వద్దంటూ సుందరయ్య కాలనీలోని లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లిపోయింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇమాంబీ తల్లిదండ్రులు దస్తగిరి, మరికొందరితో కలసి ఈ నెల 30న లక్ష్మీనారాయణ ఇంటికి వచ్చారు. అక్కడ ఉన్న ఇమాంబీని బలవంతంగా ఈడ్చుకుని వెళ్లారు.

ఈ సమయంలో లక్ష్మీనారాయణను దస్తగిరి కులం పేరుతో దూషించాడు. అతడి వెంట ఉండే ఎస్కార్ట్‌ పోలీసులను ప్రొద్దుటూరుకు పోవాలంటూ తప్పుదోవ పట్టించి కడప వైపునకు బయలుదేరాడు. ఎస్కార్ట్‌ పోలీసులు యర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్యకు సమాచారమిచ్చారు. చెన్నూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దస్తగిరి వెళుతోన్న వాహనాలను ఆపి తనిఖీ చేయగా అందులో ఇమాంబీ ఉంది.

ఘటనాస్థలికి వెళ్లి చుట్టు పక్కల వారిని విచారించగా ఇమాంబీని బలవంతంగా కిడ్నాప్‌ చేసి తీసుకుని వెళ్లి, లక్ష్మీనారాయణను కులం పేరుతో దూషించినట్లు స్పష్టమైంది. దీంతో ఈ విషయంపై 2 కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో దస్తగిరి (పులివెందుల), ఎస్‌ ఇమ్రాన్‌ (వేముల) బాష, ఎస్‌ రమీజా(యర్రగుంట్ల), ఎస్‌.అశి్వన్‌(పులివెందుల), ఎస్‌ హైదర్‌బీ (తొండూరు)లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు.

Advertisement
Advertisement