‘కిమ్స్‌’ ఎదుట ఆందోళన

14 Aug, 2019 12:49 IST|Sakshi
ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న బాధితులు, రవి మృతదేహం

గుండెకు ఆపరేషన్‌ చేశారు

మెదడువాపుతో చనిపోయాడన్నారు

మృతుని బంధువుల ఆరోపన

ఆస్పత్రి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు

వైద్యసేవల్లో లోపం లేదు: కిమ్స్‌ ఎండీ భాస్కర్‌ రావు

రాంగోపాల్‌పేట్‌: గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ బాలుడిని చికిత్స నిమిత్తం కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పిస్తే శస్త్ర చికిత్స చేసి మెదడు వాపుతో చనిపోయాడని చెప్పారు. శస్త్ర చికిత్స బాగానే జరిగిందని చెప్పిన వైద్యులు తెల్ల వారే సరికి అతను మృతి చెందినట్లు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.  వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు చనిపోయాడని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టడమేగాక రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  బాధితులు, పోలీసుల  కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, జలాల్‌పూర్‌కు చెందిన అయ్యలమ్‌ కుమారుడు రవి (13) స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.

గత నెలలో అతను అస్వస్థతకు గురికావడంతో స్థానిక వైద్యులకు చూపించారు. అయితే అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో ఈ నెల 5న సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రికి తీసుకుచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టుర్లు బాలుడి గుండెలో రంద్రాలు ఉన్నాయని ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద అతడికి చికిత్స అందించేందుకుగాను ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకున్నారు. ఈ నెల 10న బాలుడికి ఆపరేషన్‌ చేసిన వైద్యులు శస్త్ర చికిత్స విజయవంతం అయిందని తెలిపారు. 11న బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు  ఆందోళనకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి రవి మెదడు వాపు వ్యాధితో మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహానికి లోనైన మృతుని బంధువులు మంగళవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు చేపట్టారు.  వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతి చెందాడని ఆరోపిస్తూ రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

వైద్యసేవల్లో లోపం లేదు:ఎండీ భాస్కర్‌రావు
గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రవికి శస్త్ర చికిత్సకు ముందు, అనంతరం వైద్యులు పూర్తి స్థాయి వైద్యసేవలు అందించారు. ఎక్కడ ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదు. శస్త్ర చికిత్స తర్వాత ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయగా మెదడు పనితీరు సక్రమంగా లేదని గుర్తించి, అదే రోజు కుటుంబ సభ్యులకు చెప్పాం. గుండె ఆగిపోవడంతో రోగి మృతి చెందాడు.

మరిన్ని వార్తలు