కోడెల శివరామ్‌.. ఆంధ్రా నయీమ్‌

3 Jul, 2019 04:47 IST|Sakshi
పోలీసులకు వివరాలు చెబుతున్న శ్రీనివాసరావు, వెంకటపద్మారావు

నన్ను భయపెట్టి రూ.11 లక్షలు లాక్కున్నాడు

బాధితుడు యేల్లినేడి శ్రీనివాసరావు ఆవేదన

తన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ శివరామ్‌ షోరూం ఎదుట బైఠాయింపు

పట్నంబజారు (గుంటూరు): కోడెల శివరామ్‌ తన నుంచి ‘కే ట్యాక్స్‌’ వసూలు చేశాడంటూ మంగళవారం మరో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇది వరకే ఫిర్యాదు చేసిన ఇంకో బాధితుడు తన డబ్బు ఇప్పించాలంటూ గుంటూరులోని కోడెల శివరామ్‌కు చెందిన షోరూం ఎదుట ఆందోళనకు దిగాడు. తనకు చెల్లించాల్సిన రూ.11 లక్షలు ఇస్తే.. తప్ప తాను ఇక్కడ నుండి కదలబోనని.. డబ్బులు ఇవ్వకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. కోడెల శివరామ్‌ను చూసినప్పుడల్లా ఆంధ్ర నయీమ్‌లాగే అనిపించేదని అతను వాపోయాడు. బాధితుడి కథనం మేరకు.. సత్తెనపల్లికి చెందిన యేల్లినేడి శ్రీనివాసరావు కాంట్రాక్ట్‌ పనులు చేయటంతో పాటు, భోజనాల క్యాటరింగ్‌ చేస్తుంటారు. 2017లో నరసరావుపేటలో జరిగిన ఖేలో ఇండియా కబడ్డీ పోటీలకు సంబంధించి 2 వేల మందికి భోజనాలు సరఫరా చేసేందుకు రూ.24 లక్షల కాంట్రాక్ట్‌ శ్రీనివాసరావు తీసుకున్నారు. దానికి సంబంధించి తొలుత ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షలు ఇచ్చి, మిగతా మొత్తం కబడ్డీ పోటీలు ముగిశాక ఇస్తామని కోడెల శివరామ్‌ చెప్పారు.

పనులు ముగిసిన తరువాత రూ.10 లక్షల చెక్కు వచ్చిందని, రూ.5 లక్షలు కట్టి  తీసుకెళ్లాలని శివరామ్‌ హుకుం జారీ చేయటంతో చేసేది లేక రూ.5 లక్షలు చెల్లించారు. అనంతరం వచ్చిన రూ.5 లక్షల చెక్కులో రూ.3 లక్షలు, మరోసారి వచ్చిన రూ.4 లక్షల చెక్కులో రూ.2 లక్షలు తీసుకున్నారు. తనకు జరిగిన అన్యాయం శ్రీనివాసరావు తన ఆత్మీయులకు చెప్పుకున్నారు. దీంతో కోడెల శివరామ్‌ తన గురించి మాట్లాడతావా.. అంటూ రూ.లక్ష పెనాల్టీ వసూలు చేశాడు. దీనిపై బాధితుడు శ్రీనివాసరావు కొద్ది రోజుల క్రితం అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. కోడెల శివరామ్‌ అనుచరులు, డబ్బులు జూలై 1వ తేదీ కల్లా ఇస్తామని, కేసు పెట్టవద్దని శ్రీనివాసరావుకు చెప్పారు. తర్వాత ఫోన్‌లు అన్ని స్విచ్చాఫ్‌ చేసుకోవటంతో శ్రీనివాసరావు ఆందోళన చేపట్టారు. నగరంపాలెం ఎస్‌హెచ్‌వో కె.వెంకటరెడ్డి, ఎస్‌ఐ పి.భాగ్యరాజులు శ్రీనివాసరావును స్టేషన్‌కు పిలిచి వివరాలు తెలుసుకున్నారు. 

డబ్బులు ఇప్పించకపోతే ఆత్మహత్యే శరణ్యం   
కోడెల శివరామ్‌ తన నుంచి వసూలు చేసిన డబ్బులు ఇప్పించకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని గుంటూరు హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన యార్లగడ్డ వెంకటపద్మారావు నగరంపాలెం స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశాడు. వెంకటపద్మారావుకు 2015లో మద్యం షాపు రాగా మురళీకృష్ణ వైన్స్‌ పేరుతో నరసరావుపేటలో ప్రారంభించారు. అదే ఏడాది ఆగస్టు 2న కోడెల శివరామ్‌ ఆయనకు ఫోన్‌చేసి గుంటూరు చుట్టుగుంట వద్ద ఉన్న గౌతమ్‌ హీరో షోరూమ్‌కు రావాలని చెప్పారు. రూ.20 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. వెంకటపద్మారావు నాలుగు రోజుల వ్యవధిలో రూ.20 లక్షలు తీసుకెళ్ళి కోడెల శివరామ్‌కు ఇచ్చారు. తర్వాత 2017లో సత్తెనపల్లిలో కల్యాణి వైన్స్‌ పద్మారావుకు వచ్చింది. తిరిగి కోడెల శివరామ్‌ ఫోన్‌ చేసి మరో రూ.20 లక్షలు డిమాండ్‌ చేసి తీసుకున్నాడు. దీంతో తాజాగా వెంకట పద్మారావు నగరంపాలెం ఎస్‌హెచ్‌ఓ కె.వెంకటరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశాడు. 

మరిన్ని వార్తలు