లాటరీ పేరుతో రూ.10 కోట్ల లూటీ!

27 Sep, 2017 00:49 IST|Sakshi

షెవర్లీ లాటరీ అంటూ ఘరానా దోపిడీ

అడ్రస్‌ హైదరాబాద్‌.. దోపిడీ దేశవ్యాప్తం

15 నగరాల్లో అమాయకులపై వల

14 బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు

కేసు నమోదు చేసిన సీఐడీ.. ఎక్కడా దొరకని ఆధారం

మోసగాడిని పట్టుకునేందుకు అధికారుల తంటాలు

సాక్షి, హైదరాబాద్‌: ఒకే వ్యక్తి.. ఒకే చిరునామా.. 14 బ్యాంక్‌ ఖాతాలు.. నకిలీ పత్రాలతో బోగస్‌ కంపెనీ.. దాని పేరిట లాటరీతో జనానికి కుచ్చుటోపీ.. ఒకరిద్దరు కాదు దేశవ్యాప్తంగా వేలాది మంది బాధితులు! వేలు లక్షలు కాదు.. ఏకంగా రూ.10 కోట్లకుపైగా దోపిడీ!! హైదరాబాద్‌ కేంద్రంగా ఓ చీటర్‌ సాగించిన ఘరానా మోసమిదీ. ఒకే అడ్రస్‌తో అనేక బ్యాంకుల ద్వారా జరుగుతున్న నగదు లావాదేవీలపై అనుమానంతో కేంద్ర ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌.. తీగ లాగితే ఈ డొంకంతా కదిలింది. ఆర్థికశాఖ అధికారుల ఆదేశాలతో ఈ మోసంపై సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో విస్తుబో యే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 

షెవర్లీ లాటరీ వచ్చిందంటూ.. 
హైదరాబాద్‌లోని టోలిచౌక్‌లో ఉన్న ఓ అడ్రస్‌తో రాజేశ్‌కుమార్‌ అనే వ్యక్తి ఆర్‌కే ఎంటర్‌ప్రైజెస్‌ ఇంటర్నేషనల్‌ ట్రావెల్స్‌ పేరుతో ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా తెరిచాడు. ఈ కంపెనీ పేరుతో నగరానికి చెందిన అగర్వాల్‌ అనే వ్యక్తి సెల్‌కు రూ.2.5 కోట్ల షెవర్లీ లాటరీ వచ్చిందంటూ సందేశం పంపాడు. తర్వాత కొద్దిసేపటికే అతడికి ఇంటర్నేషనల్‌ ఇంటర్‌ నెట్‌ కాల్‌ వచ్చింది. ‘మీకు షెవర్లీ లాటరీ వచ్చింది. రూ.2.5 కోట్లు. ఇది కావాలంటే ఖాతా నంబర్‌ 112401500363(టోలిచౌక్‌లోని ఐసీఐసీఐ బ్రాంచీ)లో రూ.లక్ష, జ మ చేయండి’అని చెప్పారు. ఇది నమ్మిన అగ ర్వాల్‌ ఆ ఖాతాలో రూ.లక్ష డిపాజిట్‌ చేశాడు. వారం, నెల గడిచినా లాటరీ డబ్బులు రాలేదు. ఇంతలో మరో ఇంటర్‌నెట్‌ కాల్‌ వచ్చింది. ‘మీ డబ్బు ప్రాసెస్‌లో ఉంది. ఆర్బీఐ వాళ్లు చెక్‌ చేస్తున్నారు. త్వరలోనే అందుతుంది’అంటూ నమ్మించాడు. చివరికి నెలలు గడిచినా డబ్బు రాలేదు. ఫిర్యాదు చేస్తే పోలీసులు తనను విచారిస్తారన్న భయంతో అగర్వాల్‌ మిన్నకుండిపోయాడు. ఇలా బెంగళూరు, అహ్మదాబాద్, బాంగూర్‌నగర్‌(గుర్గావ్‌), భువనేశ్వర్, ఢిల్లీ, ముంబై, చెన్నై, పుణే.. ఇలా దాదాపు 15 నగరాల్లో అమాయకులను మోసం చేసి బ్యాంకు అకౌంట్‌ల్లో కోట్ల రూపాయలు జమ చేయించుకున్నాడు. 

ఎవరీ రాజేశ్‌కుమార్‌? 
పెద్దసంఖ్యలో జనాలను బురిడీ కొట్టించిన రాజేశ్‌కుమార్‌ ఎవరు? పాన్‌ నంబర్‌పై ఉన్న ఫొటో అతడిదేనా? లేదా ఇంకెవరిదైనానా? ఇప్పుడు సీఐడీని వేధిస్తున్న ప్రశ్నలివీ. సెల్‌ఫోన్‌ వాడకుండా, ఇంటర్నెట్‌ కాల్స్‌తో జనాలను మోసం చేసిన అతడిని ఎలా పట్టుకోవాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్‌ నంబర్లు.. ఒకే అడ్రస్‌పై ఉన్నాయి. ఆ అడ్రస్‌కు వెళ్లి విచారణ చేస్తే అసలు ఆ పేరుతో ఎవరూ లేరని, తాను 17 ఏళ్ల నుంచి అదే ఇంట్లో ఉంటున్నానని ఓ మహిళ తెలిపింది. చుట్టుపక్కల విచారించినా, జీహెచ్‌ఎంసీ, తదితర రికార్డులు చెక్‌చేసినా సంబంధిత మహిళ పేరిటే ఉన్నాయి. దీంతో రాజేశ్‌కుమార్‌ను పట్టుకోవడం ఎలా? అతడికి హైదరాబాద్‌లోని అడ్రస్‌ ఎలా చిక్కింది? అన్న అంశాలపై అధికారులు దృష్టి సారించారు. రాజేశ్‌కుమార్‌ ఉపయోగించిన ఫోన్‌ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ నంబర్‌కు సంబంధించిన కాల్‌డేటాలు బయటకు తీయడం అంతసులభం కాదు. ఏడాదిలోపు కాల్‌డేటా మాత్రమే సర్వీస్‌ ప్రొవైడర్‌ వద్ద అందుబాటులో ఉంటుంది. ఏడాది మించితే కాల్‌డేటా రాదు. ఒకవేళ ఉన్నా అందించకూడదన్న కోర్టు ఆదేశాలుండటంతో కేసు సంక్లిష్టంగా మారింది. కేంద్ర ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం రాజేశ్‌కుమార్‌కు సంబంధించిన 14 బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేసింది.

డబ్బు పడగానే విత్‌డ్రా.. 
దేశవ్యాప్తంగా షెవర్లీ లాటరీ పేరుతో అమాయకులను బురిడీ కొట్టించిన రాజేశ్‌కుమార్‌.. తన ఖాతాలో డబ్బులు పడిన నిమిషాల్లో ఏటీఎం సెంటర్‌కు వెళ్లి డ్రా చేసుకునే వాడు. అయితే ఈ విత్‌డ్రా కూడా ఒక్క ప్రాంతంలో కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కావడంతో సీఐడీకి చుక్కలు చూపుతోంది. ఖాతాల్లోని డబ్బులు దేశవ్యాప్తంగా ఉన్న పలు ఏటీఎం సెంటర్లతో ఎలా విత్‌డ్రా అయ్యాయో అర్థం కావడం లేదు. లాటరీ పేరిట రాజేశ్‌కుమార్‌ 2011, 2012 రెండేళ్ల కాలంలో రూ.4.5 కోట్ల లావాదేవీలను సాగించినట్టు సీఐడీ గుర్తించింది. ఆ తర్వాత జరిగిన వ్యవహారాలపై ఆరా తీస్తున్నామని, అమాయకుల నుంచి సుమారు రూ.10 కోట్లకు పైగా వసూలు చేసి ఉంటాడని సీఐడీ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. 

హైదరాబాద్‌ అడ్రస్‌తో 14 ఖాతాలు.. 
టోలీచౌక్, దిల్షాన్‌కాలనీ అడ్రస్‌పై దొంగ పత్రాలు సృష్టించిన రాజేశ్‌కుమార్‌ హైదరాబాద్‌లో ఏకంగా 14 బ్యాంకు ఖాతాలు తెరిచాడు. అన్ని అకౌంట్లు ఆర్కే ఎంటర్‌ప్రైజెస్, రాజేశ్‌కుమార్‌ పేరుతో తెరిచినట్టు బ్యాంకు అధికారులు సీఐడీకి తెలిపారు. ఆ ఖాతాలు.. యాక్సిస్‌ బ్యాంక్, పెద్దమ్మ గుడి, జూబ్లీహిల్స్‌; ఐసీఐసీఐ బ్యాంక్, నాగార్జునహిల్స్, పంజాగుట్ట్ట; ఐసీఐసీఐ బ్యాంక్, ఖైరతాబాద్‌; ఐసీఐసీఐ బ్యాంక్, రోడ్‌ నంబర్‌ 12, బంజారాహిల్స్‌; ఐసీఐసీఐ బ్యాంక్, వినాయకనగర్, గచ్చిబౌలి; యాక్సిస్‌ బ్యాంక్, మెహిదీపట్నం; యాక్సిస్‌ బ్యాంక్, జూబ్లీహిల్స్‌; స్టాండర్డ్‌ చార్టెడ్‌ బ్యాంక్, సోమాజీగూడ; స్టాండర్డ్‌ చార్టెడ్‌ బ్యాంక్, రాజ్‌భవన్‌రోడ్‌; స్టాండర్ట్‌ చార్టెడ్‌ బ్యాంక్‌ ఎస్పీ రోడ్, సికింద్రాబాద్‌; హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హైటెక్‌ సిటీ; కోటక్‌ మహీంద్ర బ్యాంక్, హిమాయత్‌నగర్‌; హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, గచ్చిబౌలి, లింగంపల్లి. 

మరిన్ని వార్తలు