‘ఆత్మ’ బంధమై...

24 Mar, 2018 08:42 IST|Sakshi
మరణంలోనూ తోడుగా..

ఆత్మహత్య చేసుకున్న భర్త..

తట్టుకోలేక భార్య బలవన్మరణం

కొత్తపేటలో విషాదం

ఆర్థిక ఇబ్బందులే కారణమా...?

కష్టాలు వెంటాడాయని.. కన్నీటి సుడుల్లో చిక్కుకున్నామని.. రాత మారే దారి కనిపించలేదని.. ఓ దంపతుల జంట. ప్రేమకు పరాకాష్ట వెదకాలని.. ఏకం కాలేని పరిస్థితులు ఎదురునిలిచాయని.. ఓ ప్రేమికుల జంట. క్షణిక నిర్ణయాలతో మరణ శాసనాలు రాస్తుండటం వేదన కలిగించే అంశం. విజయవాడకు చెందిన గూడూరు కృష్ణ కష్టాలు చుట్టుముట్టాయని ఆత్మహత్య చేసుకోగా, అది చూసి జీర్ణించుకోలేక మరణంలోనూ తోడుగా అంటూ భార్య సత్యవతి బలవన్మరణానికి పాల్పడింది.  ప్రేమికులైన నందిగామ మండలం పెద్దవరానికి చెందిన ఉప్పులూరి ప్రియాంక, చందర్లపాడు మండలం రామన్నపేటకు చెందిన కర్ల రవీంద్ర కలసి జీవించలేమని నిర్ణయానికి వచ్చి మరణంలో ఏకమవ్వాలని తిరిగిరానిలోకాలకు చేరిపోయారు.

పెళ్లినాటి ఊసులు 30 ఏళ్లుగా వారి దాంపత్యంలో మధురంగా మెదిలాడుతూ ఉండేవి. ఆనాటి బాసలు వారి అడుగుజాడల్లో అణువణువునా తొణికసలాడేవి. అందుకే ఆయన కంట్లో నలకపడితే ఆమె చెంపలపై కన్నీటి చుక్క జాలువారేది. ఆమె సంతోషపడితే ఆయన పెదవులపై చిరునవ్వు పూసేది. ఇలా సాగిపోతున్న వారి జీవితంలో అప్పుల తుఫాన్‌ చిచ్చురేపింది. ఆయనను ఆత్మాభిమానం కుంగదీయడంతో ఇక బతకలేనంటూ  అప్పుల ఉరికొయ్యకు అర్ధంతరంగా ప్రాణాలు బలిపెట్టాడు. పది నిమిషాల ముందు కళ్ల ముందు కదిలాడిన భర్త కానరానిలోకాలకు వెళ్లడంతో ఆమె గుండె బద్దలైంది. భర్త లేని జీవితం తనకొద్దంటూ ఆమె కూడా అదే ఉరికొయ్యకు వేలాడింది. శుక్రవారం విజయవాడలో జరిగిన ఈ దంపతుల ఆత్మహత్య ప్రతి హృదయాన్ని కన్నీటితో తడిపింది. 

చిట్టినగర్‌(విజయవాడ పశ్చిమ): భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని  కోమలవిలాస్‌ కొండ అడ్డరోడ్డులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. కాలనీలోని సింహాద్రి వీధిలో భార్యాభర్తలు గూడురు కృష్ణ(56), సత్యవతి(49) నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేశారు. కుమారుడు సాయి బెంగళూరులో సీఏ చదువుతున్నాడు. కృష్ణ సామారంగం చౌక్‌లో కొబ్బరికాయల వ్యాపారం చేసేవాడు. కొబ్బరి కాయలు పెట్టుకుని వ్యాపారం చేసే చోట భవనం నిర్మిస్తుండటంలో షాపు బ్రహ్మణ వీధిలోకి మార్పు చేశాడు. కృష్ణ భార్య సత్యవతి బ్రహ్మణ వీధిలోనే ఇటీవల దుస్తుల షాపు పెట్టింది. అయితే కొద్ది రోజుల కిందట కృష్ణకు షుగర్‌ వ్యాధి రావడంతో పాటు వ్యాపారాల అవసరాల కోసం కొద్దిగా అప్పులు చేశారు. అప్పుల విషయమై భార్యా భర్తల మధ్య మనస్పార్థలు వచ్చాయి.

పూజలు చేస్తుండగా..
కృష్ణ, సత్యవతిలు ఇద్దరు శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్నారు. ఆమె దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేసింది. వంట చేసేందుకు గదిలోకి వెళ్లింది. భర్త మాట్లాడం లేదని అనుమానం వచ్చిన ఆమె ఆయన ఉన్న గదిలోకి వెళ్లింది. ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఊరి వేసుకుని భర్త వేలాడుతూ కనిపించాడు. కంగారుగా మంచం ఎక్కి భర్త ఊరి వేసుకుని చీరను కత్తెరతో కట్‌ చేసింది. కిందకు జారిన ముఖంపై వాటర్‌ బాటిల్‌లోని నీళ్లు చల్లి లేపే ప్రయత్నం చేసింది. అప్పటికే భర్త మరణించాడని గ్రహించింది.

తనువు చలించి..
భర్త ఇక లేడని నిర్ధారించకున్న సత్యవతి కన్నీటి పర్యంతం అయింది. అంతే క్షణంలో నిర్ణయం తీసుకుంది.. మరణంలోనూ ఆయనకు తోడుగా ఉండేందుకు భర్త ఉరి వేసుకున్న ఫ్యాన్‌కే లుంగీతో  ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

పక్క గదిలో అద్దెకు ఉండే బేగం లోపలకు వచ్చి పరిశీలించింది.  ఇద్దరు మృతి చెంది ఉండటంతో కృష్ణ అల్లుడికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాంది. అందరికీ పెద్ద తలకాయగా ఉండే కృష్ణ, సత్యవతిలు ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనా స్థలాన్ని వెస్ట్‌ ఏసీపీ జీ రామకృష్ణ పరిశీలించారు.  కేసు నమోదు చేశారు. పో స్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికితరలించారు.

ప్రేమ జంట ఆత్మహత్య..
నందిగామ: నిండు నూరేళ్లు కలసి బతుకుదామనుకున్న ఓ ప్రేమ జంట బలవంతంగా తనువు చాలించింది. ప్రేమికులు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం నందిగామ శివారు హనుమంతుపాలెం సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. కృష్ణా జిల్లా నందిగామ మండలం పెద్దవరం గ్రామానికి చెందిన ఉప్పులూరి ప్రియాంక(20) పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీ య సంవత్సరం చదువుతోంది. చందర్లపాడు మండలం రామన్నపేట గ్రామానికి చెందిన కర్ల రవీంద్ర(24) ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. దూరపు బంధువులే. కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం పరీక్ష రాసేందుకు ప్రియాంక నందిగామ వచ్చింది. వారిరువురు హనుమంతుపాలెం వెళ్ళే దారిలో పంట పొలాల్లోని ఓ వేప చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం పొందారు. శుక్రవారం చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ప్రేమించుకున్న వీరి వివాహానికి పెద్దలు అంగీకరించరేమోనన్న అనుమానంతో ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు