6 నెలల్లో 3500 ఫోన్‌ కాల్స్‌.. పొసెసివ్‌నెస్‌ వల్లే

26 Jun, 2018 08:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సహోద్యోగి భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు, ఆర్మీ మేజర్‌ నిఖిల్‌ హండాను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిఖిల్‌ను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు.. ఈ కేసులో కీలక సాక్ష్యాధారాలు, వివరాలు రాబట్టేందుకు అతడిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు. విచారణ అనంతరం పలు కీలక విషయాలు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం... సహోద్యోగి, మేజర్‌ అమిత్‌ ద్వివేది భార్య శైలజను వివాహం చేసుకోవాలని భావించిన నిఖిల్‌.. శైలజను కలవడానికి ముందు రోజే తన భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం ఢిల్లీకి వచ్చి శైలజను తన హోండా సిటీ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమెను కోరాడు. అందుకు శైలజ నిరాకరించడంతో పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత ఆమె మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని తన కారులో తీసుకెళ్లి రోడ్డుపై పడేశాడు. ఆ తర్వాత మీరట్‌కు వెళ్లిన అనంతరం కారును పూర్తిగా శుభ్రం చేశాడు. శైలజ, తన ఫోన్‌లలో ఉన్న కొన్ని అప్లికేషన్‌లను డెలిట్‌ చేశాడు. అంతేకాకుండా తన ఫోన్‌ను పూర్తిగా ధ్వంసం చేసి, ఇంటి సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో పడేశాడు. తర్వాత తన స్నేహితుడికి ఫోన్‌ చేసి శైలజను చంపేసినట్టు చెప్పాడు. అయితే ఆమెతో తనకు అంతగా చనువు లేదని తెలిపాడు.

అయితే నిఖిల్‌ కారును పరిశీలించిన ఫోరెన్సిక్‌ నిపుణులు రక్తపు మరకలు, వేలి ముద్రలు, ముందు సీటు భాగంలో ఇరుక్కున్న తల వెంట్రుకలు గుర్తించారు. అవి శైలజకు సంబంధించినవిగా తేల్చారు. నిఖిల్‌ ఫోన్‌ డేటాను పరిశీలించినన పోలీసులు గడిచిన ఆరు నెలల్లో 3500 సార్లు శైలజకు ఫోన్‌ చేసినట్లుగా గుర్తించారు. శైలజ, నిఖిల్‌ ఫోన్లలో తొలగించిన యాప్స్‌ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తునట్లు పోలీసులు తెలిపారు. ఈ అంశాలన్నీ పరిశీలిస్తుంటే శైలజ విషయంలో పొసెసివ్‌నెస్‌తోనే నిఖిల్‌ ఉన్మాదిగా మారినట్టు తెలుస్తోందని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. అయితే శైలజను హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధం మాత్రం ఇంకా లభించలేదని ఆయన తెలిపారు.   

మరిన్ని వార్తలు