అరగంటలో ఆభరణాల పరిశీలన!

26 Jun, 2018 08:59 IST|Sakshi

ఆగమేఘాలపై తిరుమల శ్రీవారి ఆభరణాల తనిఖీ

అరగంటలోనే ముగించిన టీటీడీ బోర్డు సభ్యులు

తిరువాభరణ రిజిస్టర్‌లో ఉన్నవెన్నో కూడా చూడని వైనం

వెంకన్న కిరీటాల సంఖ్యనూ కచ్చితంగా చెప్పలేకపోవటంపై ఆలయ సిబ్బంది అవాక్కు

నేడు తిరుమలలో మరోసారి బోర్డు సభ్యుల భేటీ

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారికి పలువురు భక్తులు సమర్పించిన వెలకట్టలేని ఆభరణాలు మాయమైనట్లు వచ్చిన ఆరోపణలపై స్పందించిన టీటీడీ పాలక మండలి సభ్యులు సోమవారం వీటిని పరిశీలించారు. అయితే అసలు ఏడుకొండలవాడికి ఎన్ని ఆభరణాలు ఉన్నాయనే వివరాలను తెలుసుకోకుండానే ఈ కార్యక్రమాన్ని ఆగమేఘాలపై అరగంటలో ముగించడం గమనార్హం. పాలకమండలి సభ్యులు మంగళవారం  తిరుమలలో మరోసారి భేటీ కానున్నారు.

రిజిస్టర్‌లో 1200కిపైగా ఆభరణాలు
శ్రీవారికి భక్తులు సమర్పించిన అపురూపమైన పలు ఆభరణాలు మాయమయ్యాయని మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆభరణాలను పరిశీలిస్తామంటూ సోమవారం ఆలయంలోకి వెళ్లిన టీటీడీ పాలకమండలి సభ్యులు మొక్కుబడిగా కార్యక్రమాన్ని ముగించారని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. శ్రీవారి తిరువాభరణ రిజిస్టర్‌లో 1200కిపైగా ఆభరణాలున్నాయి. కనీసం రిజిస్టర్‌లో ఎన్ని ఆభరణాలు ఉన్నాయో కూడా తెలుసుకోకుండానే సభ్యులు పరిశీలన పూర్తి చేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అసలైనవేనా...?
తిరువాభరణ రిజిస్టర్‌లో నమోదు చేసిన ప్రకారం ఆభరణాలు అన్నీ ఉన్నాయా? వజ్రాలు, విలువైన రాళ్లతో పొదిగిన ఆభరణాలెన్ని? అవన్నీ అసలైన ఆభరణాలేనా? అనేది తేలాల్సి ఉంది. రమణ దీక్షితులు చేసిన ఆరోపణల్లో ప్రధానమైనది డైమండ్‌ అదృశ్యం. శ్రీవారి హారంలో వజ్రం ఉండేదని, తరువాత దాన్ని మాయం చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. తిరుపతిలోని రాములవారి ఆలయంలో అసలు ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణం బయట పడటం గతంలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తిరుమలలోని ఆభరణాలు అసలైనవేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తెరదించాలంటే తూతూమంత్రంగా కాకుండా ప్రతి ఆభరణంపై నిశితంగా పరిశీలన జరగాలి.

ఆభరణాలపై సభ్యుల సంతృప్తి
శ్రీవారి ఆభరణాలన్నీ పక్కాగా ఉన్నాయని పరిశీలన అనంతరం పాలక మండలి సభ్యులు పేర్కొన్నారు. అయితే రిజిస్టర్‌ ప్రకారం అన్నిటినీ పరిశీలించటం సాధ్యం కాలేదని చెప్పారు. మచ్చుకు కొన్ని ఆభరణాలను మాత్రమే పరిశీలించామని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మార్చాల్సిన అవసరం లేదని, ఇటీవల మరింత పటిష్టం చేశారని చెప్పారు.

నాలుగో, ఐదో ఉన్నాయి..
శ్రీవారికి ఆరు బంగారు కిరీటాలు, ఆరు వజ్ర కిరీటాలతో పాటు చిన్న చిన్న ఆభరణాలు అధికంగా ఉన్నాయని బోర్డు సభ్యుల పరిశీలనలో తేలినట్లు సమాచారం. అయితే బోర్డు సభ్యులు మాత్రం నాలుగో, ఐదో కిరీటాలు ఉన్నాయని... చిన్నవి, పెద్దవి చాలా ఉన్నాయని చెప్పటంపై దేవస్థానం అధికారులు విస్తుపోతున్నారు. చిన్న చిన్న ఆభరణాల సంగతి ఎలా ఉన్నా కనీసం శ్రీవారికి కిరీటాలు ఎన్ని ఉన్నాయో కూడా బోర్డు సభ్యులు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదని దేవస్థాన సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు