గుంటూరులో హత్య.. ప్రకాశంలో మృతదేహం!!

23 Nov, 2019 11:39 IST|Sakshi
నిందితులతో డీఎస్పీ శ్రీహరిబాబు, సీఐలు భక్తవత్సలరెడ్డి, రాజేశ్వరరావు, ఎస్‌ఐలు

అప్పు చెల్లించాలని కోరిన మృతుడు 

మరో ఇద్దరితో కలిసి దారుణంగా హతమార్చిన నిందితుడు  

దర్శి సాగర్‌ కాలువలో తేలిన మృతదేహం 

సాక్షి, మాచర్ల : దుర్గి మండలం అడిగొప్పల గ్రామానికి చెందిన తుర్లపాటి సుబ్బారావు (47) అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన దర్శి మంగారావుతోపాటు మరో ముగ్గురు కలిసి చంపి మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఈ సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. మాచర్ల పోలీసుల కథనం ప్రకారం.. మంగారావుకు సుబ్బారావు లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాడు. కొద్ది కాలం తర్వాత బాకీ తిరిగి చెల్లించాలని తరచూ సుబ్బారావు ఒత్తిడి చేస్తున్నాడు. నగదు తిరిగి చెల్లించటం ఇష్టం లేని మంగారావు.. గ్రామానికి చెందిన ఏల్చూరి వెంకయ్య, చింతమల్ల పేరయ్య, ఏల్చూరి నాగార్జునతో కలిసి ఈ నెల 13న సుబ్బారావును మట్టుబెట్టేందుకు పన్నాగం పన్నారు. అందులో భాగంగా తన కుమారుడు పుట్టిన రోజు పార్టీ ఇస్తానని, గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్దకు రావాలని మంగారావు సూచించాడు.

అక్కడ ఇద్దరూ కలిసి మద్యం తాగుతుండగా పేరయ్య, వెంకయ్యలు వచ్చి ఎక్కడరా మందు తాగేదని కొట్టి బెదిరించి సుబ్బారావును పొలాల్లోకి తీసుకెళ్లారు. కాలువ పక్కన పొలంలో సుబ్బారావుపై ముందే తెచ్చి పెట్టుకున్న పెట్రోల్‌ చల్లి నిప్పుపెట్టారు. మంగారావుపైనా కొంచెం పడటంతో ఆయనకు కూడా నిప్పు అంటుకుని గాయాలయ్యాయి. శరీరం కాలడంతో పడిపోయిన సుబ్బారావును కాలువ వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచి చనిపోయాడని నిర్థారించుకున్నాక వెళ్లిపోయారు. బైక్‌ను కూడా కాలువలో పడేశారు. ఈ నెల 14వ తేదీన సుబ్బారావు భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

అదే రోజు మంగారావుకు గాయాలై గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలుసుకుని విచారణ ముమ్మరం చేశారు. గుంటూరు రూరల్‌ ఎస్పీ విజయారావు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల నుంచి రాబట్టిన సమాచారం మేరకు కాలువలో వెతికించగా అక్కడ శవం బయటపడిందని పోలీసులు తెలిపారు. సుబ్బారావు హత్య కేసులో మంగారావుతో పాటు చింతమళ్ల పేరయ్య, ఏల్చూరి వెంకయ్య, నాగార్జునను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

మరిన్ని వార్తలు