చిట్టీల పేరుతో ఘరానా మోసం

31 Oct, 2017 11:30 IST|Sakshi
పోలీసులను ఆశ్రయించిన బాధితులు

మొత్తం రూ.46.50 లక్షలు ఎగనామం

చిట్టీ డబ్బుల కోసం రెండేళ్లుగా ఎదురుచూపులు

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

కొత్తపేటలో ఘటన, కేసు నమోదు  

చిట్టినగర్‌ (విజయవాడ పశ్చిమ):   ‘ఆపద సమయంలో అక్కరకు వస్తాయనే భావనతో తినీతినక రూపాయి రూపాయి కూడబెట్టి చిట్టీలు కట్టాం.. రెండేళ్లు అవుతున్నా ఇంతవరకూ మా డబ్బులు తిరిగి ఇచ్చింది లేదు.. పోలీసులను ఆశ్రయించాం.. సీపీని కలిశాం.. అందరూ కలిసి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు.. ఇప్పుడు కూడా నిందితుల తరఫున అధికార పార్టీ నేతలు మద్దతుగా వస్తున్నారే తప్ప మా గోడు పట్టించుకోవడం లేదు’ అంటూ సుమారు 16 మంది బాధితులు కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. పాల ప్రాజెక్టు సమీపంలోని రామరాజ్యనగర్‌ ప్రాంతానికి చెందిన ఎరువా ఏసురెడ్డి, దేవివిజయలక్ష్మి దంపతులు, మరికొందరూ 2014లో కొత్తపేట ఆంజనేయ వాగు ప్రాంతానికి చెందిన రాళ్లపూడి శ్రీనివాసరావు, తల్లి పద్మ వద్ద రూ.లక్షల్లో చిట్టీలు వేశారు. చిట్టీల వ్యవహారంలో ఏసురెడ్డి, విజయలక్ష్మి మీడియేటర్లుగా ఉండేవారు. అయితే కొంత మంది 17 నెలలు అయినా పాట పాడుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో వారు విసిగిపోయారు. దీంతో తమ డబ్బులు ఇవ్వాలని ఏసురెడ్డి దంపతులపై ఒత్తిడి తీసుకువచ్చారు.

అయినా ఫలితం లేకపోవడంతో 2015లో ఈ వ్యవహారంపై కొత్తపేట పోలీసులకు ఏసురెడ్డి దంపతులు ఫిర్యాదు చేయగా మరుసటి రోజు ఇరువర్గాల మధ్య రాజీ కుదిరి కేసు వెనక్కి తీసుకున్నారు. అయితే ఇంత వరకూ శ్రీనివాసరావు చిట్టీలు వేసిన వారికి డబ్బులు ఇవ్వలేదంటూ ఏసురెడ్డి దంపతులు రెండు రోజుల కిందట నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌కు చేరినా కేసులో బాధితుల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయడం మినహా పోలీసులు ముందుకు వెళ్లకపోవడంతో బాధితులు మరోమారు విషయాన్ని బహిర్గతం చేశారు.

హుటాహుటిన కేసు నమోదు
ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు రావడంతో వెస్ట్‌ ఏసీపీ రామకృష్ణ కేసు వివరాలను సీఐ దుర్గారావు ద్వారా తెలుసుకుని కేసు నమోదు చేయాలని ఆదేశించారు. చీటింగ్‌ కేసు నమో దు చేసిన కొత్తపేట పోలీసులు బాధితుల వద్ద ఉన్న ఆధారాల ప్రకారం వివరాలను నమోదు చేసుకున్నారు.  ఇప్పటి వరకు 16 మంది బాధితులు ముందుకు రాగా మొత్తం రూ.46.50 లక్షలు చెల్లించాల్సి ఉన్న ట్లు పేర్కొన్నారు. మరో వంద మంది బాధితులు ఇంకా ఉన్నారని, మధ్యవర్తి ఏసురెడ్డి పేర్కొంటుండగా, వారందరినీ స్టేషన్‌కు వచ్చి రిపోర్టు ఇవ్వాల్సిందిగా పోలీసులు పేర్కొంటున్నారు.

స్టేషన్‌ చుట్టూ అధికార పార్టీ నాయకులు
చిట్టీల కేసులో నిందితులైన రాళ్లపూడి శ్రీనివాసరావు, అతని సోదరుడు శంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అయితే నిందితులకు అండగా అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు స్టేషన్‌ ముందు వాలిపోయారు. స్థానిక డివిజన్‌తో పాటు టీడీపీ చెందిన ఓ నాయకుడు ఉదయం నుంచి పోలీస్‌ స్టేషన్‌ వద్దే పడిగాపులు కాయడం విశేషం. అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి లొంగి కేసు పక్క దారి పట్టిస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు