స్కీంపేరిట ఘరానా మోసం

9 Jul, 2020 12:28 IST|Sakshi
కంపెనీ జారీ చేసిన పేమెంట్‌కార్డు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2వేల మంది బీర్షాబా బాధితులు

జిల్లాలో రూ.6 కోట్లకు టోకరా

కమీషన్‌ ఆశతో ఇరుక్కుపోయిన ఏజెంట్లు

సిరిసిల్ల: కామారెడ్డి జిల్లాకేంద్రంగా ఏడాదిగా స్కీమ్‌ల పేరిట సాగించిన వ్యాపార లావాదేవీలు ఘరానా మోసంగా మారింది. ఒక్కసారి రూ.30వేలు చెల్లిస్తే.. పదినెలలపాటు నెలకు రూ.10 వేల చొప్పున ఇస్తామని నమ్మబలికిన ఆ సంస్థ ఇప్పుడు బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్‌ మండలాల్లో పలువురు మహిళలు, యువకులు ఈ స్కీంలో చేరి మోసపోయిన ఘటన వెలుగు చూసింది.

చైన్‌లింకుల్లో బాధితులు
జిల్లాలోని పలు గ్రామాల్లో కిరాణ దుకాణాలను ఓపెన్‌ చేసిన బీర్షాబా అనే సంస్థ చైన్‌లింకులో సభ్యులను చేర్పించింది. ఒక్క సారి డబ్బులు రూ.30వేలు కడితే చాలు పదినెలలపాటు నెలకు రూ.10వేలు జీతం వచ్చినట్లుగా రూ.లక్ష వరకు వస్తాయని ఆశ చూపించారు. ఒకరిని చూసి మరొకరు అప్పులు చేసి  బీర్షాబా సంస్థలో పెట్టుబడి పెట్టారు. డబ్బులు చెల్లించిన వారికి ఆ సంస్థ తరఫున పాస్‌బుక్‌ జారీ చేశారు. గ్రామాల్లో కిరాణ దుకాణాలు ఉండడంతో నమ్మకంగా డబ్బులు చెల్లించారు. ఒక్కరితో రూ.30వేలు కట్టిస్తే రూ.5వేలు కమీషన్‌ ఇచ్చారు. అత్యాశతో డబ్బులు కట్టించిన ఏజెంట్లు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.

ఐదు మండలాల్లో బాధితులు
జిల్లాలోని ఐదు మండలాల్లో అధికంగా బాధితులు ఉన్నారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్‌ మండలాల్లో సుమారు రెండు వేల మంది బీర్షాబా సంస్థలో డబ్బులు కట్టిన వారు ఉన్నారు. ఒక్కోక్కరు రూ.30వేల చొప్పున చెల్లించడంతో జిల్లాలో రూ.6 కోట్ల మేరకు ఆ సంస్థ మోసానికి పాల్పడినట్లు సమాచారం. కామారెడ్డిలోని ఆ సంస్థ ఆఫీస్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించంతో బీర్షాబా ఆఫీస్‌ కంప్యూటర్లను, రికార్డులను సీజ్‌ చేశారు. నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉండడం విశేషం. గ్రామాల్లో మధ్యవర్తిగా ఉండి డబ్బులు కట్టించిన ఏజెంట్లను బాధ్యులను చేస్తున్నారు. బాధితులు ఏజెంట్లపై ఒత్తిడిపెంచారు. పల్లెల్లో కూలీనాలీ చేసే వారు, బీడీ కార్మికులు బీర్షాబాలో డబ్బులు చెల్లించి లబోదిబోమంటున్నారు. ఆశకుపోయి మోసపోయామని ఆందోళన చెందుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా