భార్య, అత్తను చంపిన అల్లుడు

26 Jul, 2018 11:02 IST|Sakshi

చుండూరు(అమృతలూరు): తల్లి, కూతురు, అల్లుడు మధ్య జరిగిన తగాదాల నేపథ్యంలో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. భార్య, అత్త ప్రవర్తనపై పేట్రేగిన అల్లుడు చివరకు అత్తారింట్లోనే పచ్చడి బండతో హత్య చేశాడు. గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరులో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసింది.

మోదుకూరు దళితవాడకు చెందిన వణుకూరి వందనం, కరుణమ్మ దంపతుల కుమార్తె మరియమ్మ (35)కు వట్టిచెరుకూరు మండలం కోవెలమూడికి చెందిన బుర్రి దావీదు (50)తో దాదాపు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. పదేళ్ల నుంచి భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడంతో మరియమ్మ కొంతకాలంగా తన ఇద్దరు పిల్లలతో సహా పుట్టింట్లోనే తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. మధ్యలో పలుమార్లు భర్త దావీదు కుల పెద్దలను పంపించి కాపురానికి రావాలని అడిగినా, తాను రానని ససేమిరా చెప్పింది. దీంతో విసుగు చెందిన భర్త నాలుగు రోజుల కిందట అత్తారింటికి వచ్చాడు. భార్యా, పిల్లలతో మూడు రోజులపాటు బాగానే ఉన్నాడు.

మంగళవారం రాత్రి భోజనం చేసి అందరూ నిద్రపోతుండగా, పథకం ప్రకారం దావీదు రాత్రి 12.30 గంటల సమయంలో పచ్చడి బండతో అత్త కరుణమ్మ తలపై మోదాడు. కేకలకు నిద్ర లేచిన భార్య మరియమ్మ తల్లి వద్దకు రాగా, మరియమ్మను కూడా బండతో మోదాడు. దీంతో వారు కుప్పకూలిపోయారు. చుట్టుపక్కల జనం వచ్చి చూసి 108కు సమాచారం అందజేశారు. గుంటూరు జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరియమ్మ, చికిత్స పొందుతూ కరుణమ్మ మృతి చెందారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు