రాజస్తాన్‌లో మూక హత్య..

22 Jul, 2018 02:31 IST|Sakshi

ఆవులను స్మగ్లింగ్‌ చేస్తున్నారనే అనుమానంతో దుండగుల దాడి

జైపూర్‌: సుప్రీం కోర్టు ఎన్ని హెచ్చరికలు చేసినా, ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా మూక హత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. ఆవులను స్మగ్లింగ్‌ చేస్తున్నాడన్న అనుమానంతో శుక్రవారం రాజస్థాన్‌లో అక్బర్‌ ఖాన్‌ వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టి చంపేశారు. అక్బర్‌ ఖాన్‌ (28), అతని స్నేహితుడు అస్లాం లాడ్‌పూర్‌లో రెండు ఆవులను కొనుగోలు చేసి, హరియాణాలోని కొల్గాన్‌కు తీసుకువెళ్తున్నారు.

ఈ క్రమంలో అల్వార్‌ జిల్లాలోని లాలావండి అటవీ ప్రాంతం గుండా వెళుతుండగా ఐదుగురు వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా అస్లాం వారి నుంచి తప్పించుకోగా అక్బర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆవులను స్మగ్లింగ్‌ చేస్తున్నారనే అనుమానంతోనే వారిపై వారు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. బాధితుడి మరణ వాంగ్మూలం ప్రకారం ఐదుగురు వ్యక్తులు దాడి చేసినట్టు తెలుస్తోందని, వారిలో ధర్మేంద్ర యాదవ్, పరమ్‌జీత్‌ సింగ్‌ సర్దార్‌ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని జైపూర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ హేమంత్‌ ప్రియదర్శి తెలిపారు.

కఠిన చర్యలు తీసుకుంటాం: సీఎం
ఈ ఘటనను సీఎం వసుంధరా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘ టనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని హోంమంత్రి రాజ్‌నాథ్‌ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం ఈ ఘటనపై భగ్గుమంది. మూక దాడులకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించింది. ఇది దారుణ ఘటనగా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ అభివర్ణించారు.

మరిన్ని వార్తలు