ఠాణా ఎదుట ఆత్మహత్యాయత్నం

30 Aug, 2019 11:59 IST|Sakshi
న్యాయం చేయాలని వేడుకుంటున్న రాజేందర్‌

భూవిషయంలో పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపణ

ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న యువకుడు

కొత్తూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఘటన

న్యాయం చేయాలంటూ రహదారిపై గిరిజనుల ధర్నా

సాక్షి, కొత్తూరు: భూమి విషయంలో పోలీసులు తమను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ తండాకు చెందిన పలువురు రైతులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద గురువారం ధర్నా చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఓ గిరిజన యువకుడు ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎస్‌ఐ కృష్ణతో పాటు షాద్‌నగర్‌కు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి భూమికి సంబంధించిన గొడవలో జోక్యం చేసుకుంటూ తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని, వ్యాపారులతో కుమ్మక్కై తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు.

ఈ క్రమంలో తండాకు చెందిన యువకుడు రాజేందర్‌ స్టేషన్‌ ఆవరణలో సీఐ, ఎస్‌ఐ ఎదుటే ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నాడు. వెంటనే తండావాసులు అప్రమత్తమై అతడి నుంచి డబ్బాను లాక్కొని నీళ్లు చల్లారు. అనంతరం మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. సివిల్‌ విషయంతో పోలీసులు తలదూర్చమని హమీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని భీష్మించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఇముల్‌నర్వ గ్రామ శివారులో సర్వే నంబర్‌ 293, 295, 296, 307, 309, 325లోని సుమారు 64 ఎకరాల భూమిని కొన్నేళ్లుగా తాము కాస్తులో ఉండి సాగు చేసుకుంటున్నామని, అయితే ఇటీవల తమ తండావాసులు కొందరు భూమిని విక్రయించారని తెలిపారు. ఆ భూములను కొనుగోలు చేసిన వ్యాపారులు మధ్యలో ఉన్న పొలాలకు దారి ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.  

మాజీ సర్పంచ్‌ అరెస్టుతో..  
ఇన్ముల్‌నర్వ తండాకు చెందిన మాజీ సర్పంచ్‌ మిట్టునాయక్‌ గురువారం ఉదయం జేపీ దర్గా ఆవరణలో ఉండగా కొత్తూరు ఎస్‌ఐ కృష్ణ, సీఐ చంద్రబాబు అతడిని తమ కారులో ఎక్కించుకొని స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు, తండావాసులు దాదాపు 100 మంది ఠాణాకు చేరుకున్నారు. పోలీసులు వ్యాపారులతో కుమ్మక్కై తమపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు.

వివాదం ఉన్న పొలానికి మిట్టునాయక్‌కు సంబంధం లేకున్నా అకారణంగా ఆయనను ఎందుకు ఠాణాకు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీఎస్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఎస్‌ఐ కృష్ణ మాట్లాడుతూ.. తాము వ్యాపారులతో కుమ్మక్కు కాలేదని స్పష్టం చేశారు. వ్యాపారులు కట్టిన గోడను తండావాసులు కూలగొట్టడంతో వ్యాపారుల ఫిర్యాదు మేరకు తండావాసులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చట్ట ప్రకారమే తాము వ్యవహరించామన్నారు. 

మరిన్ని వార్తలు