యువతి నుదిట సింధూరం.. యువకుడి పాలిట మరణ శాసనం

19 Sep, 2023 19:16 IST|Sakshi

సాక్షి, క్రైమ్‌: షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. బలవంతంగా యువతి నుదట దిద్దిన సింధూరం!.. ఓ యువకుడిపాలిట మరణ శాసనమైంది. ప్రేమ పేరుతో తన కూతురిని వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని హతమార్చాడు ఓ తండ్రి. సినీ ఫక్కీలో పక్కా మర్డర్‌కు ప్లాన్ వేసి మరీ కిరాతకంగా ప్రాణం తీశాడు.

బీహార్‌కు చెందిన కరుణాకర్‌ కుటుంబం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలో నివాసం ఉటూ చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆగష్టు 29వ తేదీ నుంచి కరుణాకర్‌ కనిపించకుండా పోయాడు. దీంతో.. అతని సోదరుడు దీపక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు తెలిశాయి. 

రంజిత్‌ కుమార్‌ అనే వ్యక్తి ప్లాన్‌ ప్రకారమే కరుణాకర్‌ను హత్య చేశారని పోలీసులు దర్యాప్తు ద్వారా తేల్చారు. రంజిత్‌ కుమార్‌ కూతురిపై కరుణాకర్‌ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె నుదుటిపై సింధూరం కూడా దిద్ది ఆమెను ఇబ్బందికి గురి చేశాడు. ఈ విషయం బయటకు పొక్కితే తన పరువు పోతుందని రంజిత్‌ రగిలిపోయాడు. కరుణాకర్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. 

ఆగష్టు 15వ తేదీన కేశంపేట మండలంలోని నిడదవెళ్లి గ్రామం నుంచి జూలపల్లి వెళ్లే  రోడ్డులో ఉన్న వరి చేను దగ్గరికి పిలిపించుకున్నాడు. విచక్షణా రహితంగా కరుణాకర్‌పై దాడికి దిగాడు. కాళ్లు చేతులు కట్టేసి వరి చేను నీటి బురద లో తలకాయ ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అదే బురదలో పాతిపెట్టి వెళ్లిపోయారు. దర్యాప్తు ద్వారా ఈ కేసును చేధించామని, ప్రధాన నిందితుడు రంజిత్‌తో పాటు అతనికి సహకరించిన వాళ్లనూ అరెస్ట్‌ చేశామని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి మీడియాకు  వెల్లడించారు. నిందితులపై 302, 201 ,34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉండగా.. వాళ్లను జువైనల్‌ హోంకు తరలించినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు