అలా దొరికిపోయాడు

30 Jun, 2018 11:57 IST|Sakshi

పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఓ నిరుద్యోగికి అది కష్టతరమన్న విషయం అర్థమైంది. ఓ ఫ్లాన్‌ వేసి అధికారులను బురిడీ కొట్టించాలనుకున్నాడు. అయితే ఫిజికల్‌ టెస్టులో అతగాడి వ్యవహారం బయటపడింది. అతనిపై కేసు నమోదు చేసి అధికారులు కటకటాల వెనక్కి నెట్టారు. 

మీరట్‌: బులంద్‌షహర్‌కు చెందిన అంకిత్‌ కుమార్‌కు పోలీస్‌ కావాలనే కల. ఎస్సై ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశాడు. రాత పరీక్ష క్లియర్‌ అయిపోగా, ఫిజికల్‌ టెస్టులు మిగిలి ఉన్నాయి. అయితే ఎత్తు సమస్య అతని పాలిట శాపంగా మారింది. నిబంధనల ప్రకారం 168 ఎత్తు కాగా, అంకిత్‌ ఓ సెంటీమీటర్‌ తక్కువగా ఉన్నాడు. దీంతో ఎత్తు పెరిగేందుకు అడ్డమైన మందులు వాడాడు.. ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌లు చేశాడు. అయినా లాభం లేకుండా పోయింది. దీంతో ఓ ఫ్లాన్‌ వేశాడు.   

అలా దొరికిపోయాడు.. జుట్టులో హెన్నా పెట్టుకుని శారీరక ధారుడ్య పరీక్షలకు హాజరయ్యారు. ఎత్తు కొలిచే సమయంలో మెషీన్‌ మెటాలిక్‌ ప్లేట్‌కు, జుట్టుకు మధ్య గ్యాప్‌ ఉండటం అధికారులకు అనుమానం తెప్పించింది. అతన్ని పక్కకు తీసుకెళ్లి వెతకగా.. జుట్టులో  హెన్నా బయటపడింది. దానిని తొలగించి నిల్చోవాలని అధికారులు ఆదేశించారు. తిరిగి ఎత్తు కొలవగా ఒక సెంటీమీటర్‌ తక్కువ హైట్‌ వచ్చింది. దీంతో అధికారులు అతన్ని అనర్హుడిగా ప్రకటించారు. అంతేకాదు రిక్రూట్‌మెంట్‌లో మోసానికి యత్నించినందుకుగానూ ఐపీసీ సెక్షన్‌ 420 ప్రకారం అతనిపై కేసు నమోదు చేసినట్లు మీరట్‌ ఎస్పీ(ట్రాఫిక్‌), ఫిజికల్‌ టెస్టుల పర్యవేక్షకుడు సంజీవ్‌ బాజ్‌పాయి వెల్లడించారు.

అంకిత్‌ మాటల్లో...‘నా ఎత్తు తక్కువ. అది కేవలం 1 సెం.మీ. మాత్రమే. అది పెరిగేందుకు చాలా యత్నించా. కానీ, వీలు పడలేదు. అలాగని అధికారులు మినహాయింపు ఇవ్వరు కదా!. రాత పరీక్ష క్వాలిఫై అయిన నేను ఈ అవకాశం ఎందుకు వదులుకోవాలని భావించా. నేను చేసింది తప్పే. కానీ, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇలా చేశా. దయచేసి అవకాశం ఇవ్వండి’ అని 24 ఏళ్ల అంకిత్‌ ప్రాధేయపడుతున్నాడు. అంకిత్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు