మావోల ఘాతుకం 

12 Apr, 2019 02:29 IST|Sakshi

ఈవీఎంలు తీసుకొస్తుండగా పోలీసులపై కాల్పులు 

ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు 

గడ్చిరోలి జిల్లా ఏటపల్లి అటవీ ప్రాంతంలో ఘటన 

అదే ఏటపల్లి తాలూకాలో పోలింగ్‌ కేంద్రం వద్ద బాంబు పేల్చిన మావోలు 

కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లిలో మావోయిస్టులు రెచ్చిపోయారు. గురువారం ఏటపల్లి తాలూకా హెడ్రీ ఠాణా పరిధిలోని పర్సల్‌గోంది అటవీ ప్రాంతం వద్ద ఎన్నికలు ముగిశాక పోలీసులు ఈవీఎంలను, పోలింగ్‌ సిబ్బందిని ప్రత్యేక వాహనంలో తీసుకువస్తుండగా మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. వాహనంపై ఐఈడీ బాంబును పేల్చగా ముగ్గురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు పారిపోయారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా గాయాలైన సిబ్బంది ప్రత్యేక హెలికాప్టర్‌లో నాగ్‌పూర్‌ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మరోసారి మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు తెలిసింది. 

పోలింగ్‌కేంద్రం వద్ద మందుపాతర: ఏటపల్లి తాలూకా కసన్‌సూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వాగేజరి గ్రామంలోని పోలింగ్‌ కేంద్రం సమీపంలో పోలీసులను టార్గెట్‌ చేస్తూ గురువారం మావోయిస్టులు మందుపాతర పేల్చారు. పోలింగ్‌ కేంద్రానికి అతి సమీపంలో ఉదయం 11.30 గంటలకు మందుపాతర పేల్చగా ఓటర్లు, పోలీసులు ఉలిక్కి పడి పరుగులు తీశారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదని పోలీసులు తెలిపారు. ఇక బుధవారం రాత్రి అదే ఏటపల్లి తాలూకా పరిధిలో జాంబియా గుట్లలో జవాన్‌ సునీల్‌ సైకిల్‌కు ఐఈడీ బాంబును మావోయిస్టులు అమర్చగా అది పేలడంతో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మూడు ఘటనలతో ఏటపల్లితో పాటు గడ్చిరోలి జిల్లా వ్యాప్తంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాలో 61శాతం వరకు పోలింగ్‌ జరిగినట్లు అధికారులు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు