ఆమెతో వివాహేతర సంబంధం కోసం ఇద్దరి ఘర్షణ!

25 Jul, 2019 08:48 IST|Sakshi

మురికిపూడిలో వ్యక్తి దారుణహత్య

మహిళ కోసం ఇద్దరి మధ్య ఘర్షణ

కక్ష పెంచుకుని హతమార్చిన వైనం

సాక్షి, చిలకలూరిపేట: వివాహిత మహిళతో అక్రమ సంబంధం నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకొన్న ఘర్షణ ఒకరి మృతికి దారితీసింది. మండలంలోని మురికిపూడి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ భర్తను వదలి ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తోంది. ఆ మహిళతో ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని వేమవరం గ్రామానికి చెందిన ఒక యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

 ఇటీవల ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలంలోని పోలూరు గ్రామానికి చెందిన షేక్‌ ఖాదర్‌ బాబావలి (29) మురికిపూడిలో బిస్మిల్లా చికెన్‌ సెంటర్‌ పేరుతో మాంసం దుకాణాన్ని ఏర్పాటు చేశాడు.  అనంతరం ఇదే మహిళతో బాబావలికి కూడా  పరిచయం ఏర్పడింది. ఇతనితో కూడా  ఆ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది.  ఈ విషయమై బాబావలికి, వేమవరం గ్రామానికి చెందిన వ్యక్తికి తెలిసి గత కొద్ది రోజులుగా ఘర్షణ పడుతూ వచ్చారు.

 ఈ నేపథ్యంలోనే  కొద్దిరోజుల కిందట ఇద్దరూ మద్యం తాగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో   బాబావలిని అడ్డు తొలగించుకోవాలని వేమవరం గ్రామానికి చెందిన వ్యక్తి  నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం   మంగళవారం రాత్రి జాతీయ రహదారి సమీపంలో ఉన్న మద్యం దుకాణంలో బాబావలితో  కలిసి అతిగా మద్యం తాగారు. బాబావలి స్వగ్రామమైన పోలూరుకు వెళ్లకుండా మురికిపూడిలోని మాంసం  దుకాణానికి చేరుకుని షట్టర్‌ వేసుకుని నిద్రించాడు. అదే సమయంలో వేమవరం యువకుడు మహిళ ఇంటికి వెళ్లి బాబావలితో సంబంధం వదులుకోవాలని హెచ్చరించాడు.  తన మాట వినని పక్షంలో బాబావలిని హత్యచేస్తానని మహిళను  బెదిరించాడు.

అనంతరం మద్యం మత్తులోనే చికిన్‌ దుకాణానికి  చేరుకొని   షట్టర్‌ పైకి లాగి మద్యం మత్తులో  నిద్రిస్తున్న బాబావలిని గొడ్డలితో  విచక్షణారహితంగా నరికి   దారుణంగా హత్య చేశాడు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలు గడిచినా దుకాణం తీయలేదని బాబావలి బంధువులు షట్టర్‌ తీసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న  రూరల్‌ సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ జి.అనీల్‌కుమార్, సిబ్బందితో సంఘటన స్థలానికి   చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.  

మరిన్ని వార్తలు