మ్యాట్రిమోని మోసగాడి ఆటకట్టు

5 Dec, 2018 09:02 IST|Sakshi

ఎంఎన్‌సీ కంపెనీల్లో మేనేజర్‌గా..

ఆస్పత్రుల్లో డాక్టర్‌నంటూ టోకరా

నిందితుడు నైజీరియన్‌  అరెస్టు  

ఢిల్లీ నుంచి ట్రాన్సిట్‌ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చిన పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: అమెరికా...యూకేలోని ఎంఎన్‌సీ కంపెనీల్లో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని చెబుతూ అందమైన యువకుల ఫొటోలు మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేసి...యువతులు, మహిళలను మోసం చేస్తున్న నైజీరియన్‌ను రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఢిల్లీలో పట్టుకొని ట్రాన్సిట్‌ వారంట్‌పై మంగళవారం నగరానికి తీసుకొచ్చారు. డాక్టర్‌ అయూష్‌ త్యాగి పేరుతో మ్యాట్రిమోని వెబ్‌సైట్‌ ద్వారా నగరానికి చెందిన మహిళతో పరిచయం పెంచుకుని రూ.5,45,100 టోకరా వేశాడనే ఫిర్యాదు మేరకు గ్రేటర్‌ నోయిడాలో వస్త్ర వ్యాపారం చేస్తున్న నైజీరియన్‌ అబెల్‌ ఒదరను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి నాలుగు ల్యాప్‌టాప్‌లు, 13 సెల్‌ఫోన్లు, రెండు పాస్‌పోర్టులు, రెండు రౌటర్లు, ఐదు డాంగిల్స్, రెండు ట్యాబ్‌లు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...నైజీరియాకు చెందిన అబెల్‌ ఒదర టూరిస్ట్‌ వీసాపై 2014లో భారత్‌కు వచ్చాడు. అనంతం బిజినెస్‌ వీసాగా మార్చుకున్న అతను తన స్నేహితుడు కొలిన్స్‌ ఇబాజే, అతని భార్య ఒమోజి ఎంప్రెస్‌ ఇబాజేతో కలిసి గ్రేటర్‌ నోయిడాలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. స్నేహితుల సహకారంతో మ్యాట్రిమోని మోసాలకు తెరలేపిన ఇతను పెళ్లి కొడుకుగా అవతారమెత్తాడు.  

ఏడాదిగా మోసాలు...
ఏడాదిగా మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో అమెరికా, యూకేలోని ఎంఎన్‌సీ కంపెనీల్లో మేనేజర్‌ స్థాయి ఉద్యోగం చేస్తున్నానని, ప్రముఖ ఆసుపత్రుల్లో మెడికల్‌ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్నానని ప్రొఫైల్‌తో పాటు అందమైన యువకుల ఫొటోలను ఆప్‌లోడ్‌ చేశాడు. అమెరికా, యూకేలో ఉన్నట్లుగానే వర్చువల్‌ నంబర్లతో మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో రిజిష్టర్‌ అయిన యువతులతో  చాటింగ్‌ చేసేవాడు. పెళ్లి ప్రతిపాదన చేసిన అనంతరం వ్యక్తిగతంగా కలుస్తానంటూ మోసానికి తెరలేపేవాడు. జ్యువెల్లరీ, ఐప్యాడ్, ఖరీదైన ఫోన్లు, ట్రావెలర్‌ చెక్‌లను వెబ్‌సైట్‌ నుంచి కాపీ చేసి గిఫ్ట్‌ పార్శిల్‌ పంపుతున్నానంటూ ఫొటోలు పంపేవాడు. ఢిల్లీలోని భారత మహిళల సహకారంతో కస్టమ్స్‌ అధికారిగా ఫోన్‌ చేయించి మీకో గిఫ్ట్‌ పార్శిల్‌ వచ్చిందని అది విడుదల చేయాలంటే ట్యాక్స్‌లు, చార్జీలు చెల్లించాలనడంతో నమ్మిన బాధితులు వారిచ్చిన బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు జమచేసేవారు.

ఇదే తరహాలో షాదీ.కామ్‌లో నగరానికి చెందిన మహిళతో డాక్టర్‌ అయూష్‌ త్యాగి పేరుతో పరిచయమైన అబెద్‌  హైదరాబాద్‌లో సొంతంగా క్లీనిక్‌ పెట్టుకోవాలనుకుంటున్నానని, తనకు ఓ కుమార్తె ఉందని, భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని నమ్మించాడు. యూకే నుంచి భారత్‌కు వచ్చేందుకు ఇండియా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఆగస్టు 8న ముంబై విమానాశ్రయానికి చేరుకుంటానని  నమ్మించాడు. అనంతరం పూజ అనే పేరుతో కస్టమ్స్‌ అధికారిగా ఫోన్‌కాల్‌ చేసి రూ.మూడు కోట్లతో అయూష్‌ త్యాగిని పట్టుకున్నామని, విడుదల చేయాలంటే రూ.5,45,100 డిపాజిట్‌ చేయాలని కోరడంతో వారి మాటలు నమ్మిన బాధితురాలు విడతల వారీగా వివిధ బ్యాంక్‌ ఖాతాల్లో డిపాజిట్‌ చేసింది. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో సాంకేతిక సాక్ష్యాలతో నిందితుడు అబెల్‌ ఒదరను ఢిల్లీలో నవంబర్‌ 30న అరెస్టు చేసి ట్రాన్సిట్‌ వారంట్‌పై మంగళవారం నగరానికి తీసుకొచ్చారు. ఇతడిని కోర్టులో హజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ కోసం కస్టడీకి తీసుకొని విచారించనున్నారు.

మరిన్ని వార్తలు