వివాహితుడు దారుణ హత్య?

20 Dec, 2019 12:25 IST|Sakshi
సీటీఎం సమీపంలోని రైలు పట్టాలపై మృతదేహాన్ని పరిశీలిస్తున్న స్థానికులు

సీటీఎం సమీపంలో రైలు పట్టాలపై మృతదేహం

కనిపించని తల, కాళ్లు, చేయి

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించినట్లు అనుమానాలు

చిత్తూరు, మదనపల్లె టౌన్‌ : ఓ వివాహితుడి∙మృతదేహం కలకలం రేపిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. మృతదేహం పడి ఉన్న తీరు చూస్తుంటే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కదిరి రైల్వే పోలీసుల కథనం..కురబలకోట మండలం సింగన్నగారిపల్లెకు చెంది న రైతు కృష్ణమూర్తి కుమారుడు కె. ఈశ్వర(35) చిన్న చిన్న వ్యాపారాలు, కూలిపనులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఈశ్వర్‌ గురువారం ఉదయం మదనపల్లె మండలం, సీటీఎం పంచాయతి అంగళ్లు మార్గంలోని రైలుపట్టాలపై శవమై వెలుగులోకి వచ్చాడు. పశువుల కాపర్లు గుర్తించి సీటీఎం రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కదిరి రైల్వే పోలీసులకు చేరవేశారు. దీంతో రైల్వే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

మృతదేహం వద్ద లభించిన ఆధార్‌ కార్డు ఆధారంగా అతడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు రైలు కిందపడి చనిపోయి ఉంటే తల, కాళ్లు, చేతులు వేరైనా కనీసం ఎంతో కొంత దూరంలో కనిపించేవని, అయి తే తల, కాళ్లూ, ఒక చేయి లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎవరో పక్కాగా ప్లాన్‌ ప్రకారం ఈశ్వర్‌ను హత్య చేసి, తల, కాళ్లను, చేతిని వేరు చేసి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతదేహాన్ని రైలుపట్టాలపై పడేసి ఉండొచ్చని భావిస్తున్నారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని అనంతపురం జిల్లాలోని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ సాల్మన్‌ రాజు తెలి పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదలా ఉంచితే, మృతుడి స్వగ్రామానికి 3 కిలో మీటర్ల దూరంలోని మృతదేహం వెలుగులోకి రావడం, ఇంటి నుంచి సెల్‌ఫోన్‌తో వెళ్లిన మృతు డి వద్ద సెల్‌ఫోన్‌ లేకపోవడంతో రైల్వే పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు