వీడియో గేమ్‌ ప్రభావంతో విద్యార్థి కాల్పులు

11 Jan, 2020 18:24 IST|Sakshi

ఒక టీచరు మృతి, ఐదుగురు విద్యార్థులకు గాయాలు 

మెక్సికోలోని కోహులియా రాష్ట్రంలో శుక్రవారం ఓ ప్రైవేటు పాఠశాలలో 11ఏళ్ల ఆరవ తరగతి విద్యార్థి.. ఓ టీచర్‌ను రెండు పిస్టళ్లతో కాల్చి చంపడంతోపాటు మరో టీచర్‌, ఐదుగురు విద్యార్థులను తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 1999లో అమెరికాలోని కొలంబైన్‌లోని ఓ పాఠశాలలో ఓ టీచర్‌ను, 12 మంది విద్యార్థులను ఇద్దరు విద్యార్థులు కాల్చి చంపిన సంఘటన ఆధారంగా రూపొందించిన ఓ వీడియో గేమ్‌ ప్రభావంతో ఆ విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టు పోలీసు అధికారులు భావిస్తున్నారు. 

జోస్‌ ఏంజెల్‌ రామోస్‌ అనే విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం అతని తల్లి మరణించడంతో గ్రాండ్‌ పేరెంట్స్‌తో జీవిస్తున్నాడు. అతనికి వీడియో గేమ్స్‌ ఆడే అలవాటు బాగా ఉందని తెల్సింది. ‘నేచురల్‌ సెలక్షన్‌’ అనే వీడియో గేమ్‌లోలాగా తెల్లటి చొక్కా, దాని మీదుగా నల్లటి పట్టీలు వచ్చే నల్లటి ప్యాంట్‌ ధరించి రెండు చేతుల్లో రెండు పిస్టళ్లను పట్టుకొని పాఠశాల గదిలోకి వచ్చాడు. వాటిని ఎందుకు పట్టుకొచ్చావ్‌ అంటూ మేరియా మెడినా అనే 60 ఏళ్ల టీచరు అడగడంతోనే ఆమెను అక్కడికక్కడే కాల్చి చంపాడు. అడ్డు వచ్చిన ఆల్డో ఒమర్‌ అనే 40 ఏళ్ల టీచరును, ఐదుగురు విద్యార్థులపైకి కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అతను ధరించి తెల్లటి చొక్కాపై గేమ్‌లా ‘నేచురల్‌ సెలక్షన్‌’ అని రాసి ఉంది. వీడియో గేమ్‌లోని క్యారెక్టర్‌ రెండు పొడువాటి తుపాకులను పట్టుకోగా, రామోస్‌ రెండు పిస్టళ్లను పట్టుకొచ్చాడు. నిన్న అతను స్కూల్‌కు వచ్చినప్పటి నుంచి తోటి విద్యార్థులతో ‘టు డే ఈజ్‌ ద డే’ అని పలుసార్లు అన్నాడట. బహూశా అది ఆ వీడియో గేమ్‌లోని పదం అయి ఉండవచ్చు. నేచురల్‌ సెలక్షన్‌ గేమ్‌ను శాన్‌ ఫ్రాన్సిస్కోకు చెందిన ‘అన్‌నోన్‌ వరల్డ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ కంపెనీ తయారు చేసింది. దీనిపై మెక్సికన్‌ మీడియా ఆ కంపెనీ ప్రతినిధులను సంప్రతించగా, వారు స్పందించేందుకు నిరాకరించారు. రామోస్‌ సౌమ్యుడే కాకుండా పాఠశాలలో మంచి మార్కులు తెచ్చుకునే తెలివిగల విద్యార్థి అని, మానసిక ఒత్తిడితో బాధ పడుతున్నట్లు ఎప్పుడూ కనిపించలేదని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

మరిన్ని వార్తలు