చదువుకుందాం.. ఆడుకుందాం

14 Nov, 2023 04:49 IST|Sakshi

ప్రభుత్వ బడుల్లో క్రీడలకు ప్రాధాన్యం 

అకడమిక్‌ కేలండర్‌లో అంతర్భాగం చేసిన ప్రభుత్వం  

45 వేల స్కూళ్లకు సామగ్రి అందజేత 

ప్రతి స్కూల్‌ నుంచి కనీసం ఇద్దరు జాతీయ పోటీలకు ఎంపికయ్యేలా శిక్షణ.. త్వరలో జిల్లాల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీల ఏర్పాటు 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సదుపాయాలు కల్పించి విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం విద్యార్థులను క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే పాఠశాలలకు పీఈటీలను నియమించగా.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సమగ్ర శిక్ష ద్వారా రూ.27 కోట్లతో క్రీడా సామగ్రిని సైతం అందించింది. జాతీయ విద్యావిధానంలో భాగంగా క్రీడలనూ అకడమిక్‌ కేలండర్‌లో అంతర్భాగం చేసింది.

పాఠశాలల్లో క్రీడల్లో ప్రతిభ గల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు త్వరలో ప్రతి జిల్లాలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. వీటిని ఈ విద్యా సంవత్సరంలోనే అందుబాటులోకి తీసుకొచ్చి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కేంద్రాలలో ఎంపిక చేసిన క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు.  
 
క్రీడా పరికరాల కొనుగోలు 
రాష్ట్రంలో 33,704 ప్రాథమిక, 4,138 ప్రాధమికోన్నత, 6,112 ఉన్నత, 1,044 హయ్యర్‌ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. ఆయా స్కూళ్లలో విద్యార్థుల వయసుకు తగినట్టుగా క్రీడా పరికరాలను కొనుగోలు చేశారు. సీనియర్‌ సెకండరీ, ఉన్నత పాఠశాలలకు 17 రకాల వస్తువులు, ప్రాథమికోన్నత పాఠశాలలకు 14 రకాలు, ప్రాథమిక పాఠశాలలకు 9 రకాల వస్తువుల చొప్పున అందించారు. వీటిలో వాలీబాల్, నెట్, త్రోబాల్, నెట్, హ్యాండ్‌ బాల్, టెన్నికాయిట్, యోగా మ్యాట్లు, ఫుట్‌బాల్, షాట్‌పుట్‌ వంటి వస్తువులు ఉన్నాయి.

ఈ సామగ్రి కోసం ఒక్కో పాఠశాలకు రూ.7,080 నుంచి రూ.17,700 చొప్పున నిధులు వెచ్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతి, బోధన ప్రమాణాల మెరుగుదల కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినెలా సబ్జెక్టుల ఉపాధ్యాయులతో స్కూల్‌ కాంప్లెక్స్‌ నిర్వహిస్తున్నారు. ఇకపై ఈ స్కూల్‌ కాంప్లెక్స్‌లో క్రీడా సామగ్రి వినియోగంపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలో పీఈటీలు లేని పాఠశాలల్లో స్థానిక ఉపాధ్యాయులను గుర్తించి విద్యార్థుల్లో క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.సురేష్‌ కుమార్‌ ఆదేశాలు సైతం జారీ చేశారు.  
 
గతానికి భిన్నంగా క్రీడలకు ప్రోత్సాహం 
ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల్లో ప్రతిభ గల విద్యార్థులు ఉన్నప్పటికీ గతంలో వారికి ప్రోత్సాహం దాదాపు శూన్యమనే చెప్పాలి. అయితే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక క్రీడలను విద్యలో అంతర్భాగం చేసింది. క్రీడల్లో పాల్గొనే ఆసక్తి గల విద్యార్థుల వివరాలు నమోదు చేసుకునేందుకు స్కూల్‌ అకడమిక్‌ మానటరింగ్‌ యాప్‌లో ‘స్కూల్‌ గేమ్స్‌’ విభాగాన్ని కూడా అధికారులు జోడించారు. జిల్లాస్థాయి పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫామ్‌ సైతం అందిస్తోంది.

అంతేకాకుండా జిల్లా ఆపై స్థాయి పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు రవాణా చార్జీలు సైతం ప్రభుత్వమే అందించడం గమనార్హం. ఇప్పటికే క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను గుర్తించి జిల్లాకు ఐదు చొప్పున 130 క్రీడా ప్రతిభా అవార్డులను ప్రదానం చేశారు. అంతేకాకుండా జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి అండర్‌ 14, 17, 19 విభాగాల్లో జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 120 క్రీడాంశాల్లో ఇప్పటి దాకా 60 క్రీడాంశాల్లో పోటీలు ముగిశాయి.

డిసెంబర్‌లో ఆడుదాం ఆంధ్రా పోటీలు ఉన్నందున ఈ నెలాఖరు నాటికి మిగిలిన అంశాల్లో పోటీలు పూర్తి చేసేందుకు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కృషి చేస్తోంది. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన వారికి రాష్ట్రస్థాయి పోటీలకు శిక్షణ ఇవ్వనున్నారు. జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు ఫిబ్రవరిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉత్తమ క్రీడాకారులను తయారు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రతి జిల్లాలోను సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలను ఏర్పాటు చేసి, ఆ జిల్లాలో క్రీడల్లో ప్రతిభ గల విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.   

మరిన్ని వార్తలు