అళగిరి తనయుడు దురై దయానిధిపై ఈడీ గురి

24 Apr, 2019 20:40 IST|Sakshi

సాక్షి, చెన్నై : డిఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి తనయుడు దురై దయానిధి మీద ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గురి పెట్టింది. గ్రానైట్‌ స్కాం కేసులో దురై దయానిధిని టార్గెట్‌ చేస్తూ, ఆయనకు సంబంధించిన రూ. 40.34 కోట్లు విలువ కల్గిన చర, స్థిర ఆస్తుల్ని ఈడీ అటాచ్‌ చేసింది. ఈకేసు విచారణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈడీ నిర్ణయించడం అళగిరికి పెద్ద షాక్కే. మదురై జిల్లా మేలూరు కేంద్రంగా సాగుతూ వచ్చిన గ్రానైట్‌ అక్రమ రవాణాను  డీఎంకే ప్రభుత్వ హయంలోనే  ఆ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సహాయం వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గ్రానైట్‌ మాఫియా రూపంలో ప్రభుత్వానికి పదహారు వేల కోట్ల మేరకు నష్టం వాటిళ్లినట్టు  ఆధారాలతో సహా బయట పెట్టారు. ఇందుకు ఆయనకు లభించిన ప్రతి ఫలం బదిలీ వేటు. ఈ స్కాంలో ఎందరో పెద్దలు ఉన్నారంటూ చిట్టాను సైతం సహాయం విప్పినా పట్టించుకున్న పాలకులు కరువే. ఈ సమయంలో డిఎంకే  కాంగ్రెస్‌ల మధ్య కేంద్రంలో ఉన్న బంధం బెడిసి కొట్టడం ట్విస్టులకు దారి తీసింది. డిఎంకే కుటుంబాన్ని గురి పెట్టి స్పెక్ట్రమ్‌ స్కాం, అక్రమ బిఎస్‌ఎన్‌ఎల్‌ కనెక్షన్లు  అంటూ కేసుల మోత మోగింది. 

అలాగే, అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న ఎంకే అళగిరి అండదండాలతో ఆయన వారసుడు దురై దయానిధి మదురైలో యదేచ్చగా  గ్రానైట్‌  తవ్వేసుకుంటూ సొమ్ము చేసుకున్నట్టుగా గుర్తించిన ఈడీ ఓ కేసును నమోదు చేసింది. తొలి నాళ్లలలో నత్తనడకన ఈ కేసు సాగినా, ఆ తదుపరి కనుమురుగైంది. అదే సమయంలో  రాష్ట్రంలో అధికారం మార్పు జరగడంతో  ఎట్టకేలకు ఐఎఎస్‌  సహాయ నిజాయితీని మద్రాసు హైకోర్టు గుర్తించింది. రాష్ట్రంలో సాగుతున్న గ్రానైట్, ఖనిజన సంపదల అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు ఆయన నేతృత్వంలో ఓ కమిటీని రంగంలోకి దించింది. ఈ కమిటీ సమగ్ర నివేదికను హైకోర్టుకు సైతం సమర్పించి ఉన్నది. అలాగే, గ్రానైట్‌ అక్రమార్జనలో ఉన్న పెద్దలు, ఏ మేరకు తవ్వకాలు సాగాయి, అనేక గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు ఏ మేరకు కనుమరుగు అయ్యాయో అన్న వివరాలను ఆ నివేదికలో పొందు పరిచి ఉన్నారు. ఈ నివేదిక కోర్టుకు చేరి రెండేళ్లు అవుతున్నది.  ఈ నేపథ్యంలో  అళగిరి వారసుడు దురై దయానిధి మీద దాఖలైన కేసు ఫైల్‌ దుమ్ము దుళి పే పనిలో ఈడీ నిమగ్నం కావడం 

ఆస్తుల అటాచ్‌.....
ఆరేళ్ల క్రితం నమోదైన కేసు ఫైల్‌ను దుమ్మదులిపే పనిలో పడ్డ ఈడీ వర్గాలు దురై దయానిధిని టార్గెట్‌ చేశారు. గ్రానైట్‌ అక్రమార్జన ద్వారా ప్రభుత్వానికి పంగనామాలు పెట్టిన దురై దయానిధి ఆస్తుల్ని అటాచ్‌ చేయడం గమనార్హం. తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో దయానిధి ఆగడాలకు మదురైలో హద్దే లేదన్న ప్రచారం మరీ ఎక్కువే. అందుకే కాబోలు ప్రస్తుతం  ఎప్పుడో నమోదైన కేసు మీద ఈడి ఇప్పుడు దృష్టి పెట్టి విచారణ వేగవంతానికి సిద్ధమైనట్టుంది. ఒలంపస్‌ గ్రానైట్స్‌ పేరుతో సాగిన వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఈడీ, ప్రస్తుతం కేసు విచారణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధం అయింది. త్వరలో ఈకేసు కోర్టు విచారణకు రానున్న దృష్ట్యా అంతలోపు తమ కొరడాను ఝుళిపించే పనిలో నిమగ్నమైంది.

బుధవారం  దురై దయానిధి ఆస్తుల అటాచ్‌ ఉత్వర్వులకు సంబంధించిన ప్రకటన ఢిల్లీలో వెలువడింది. ఆయనకు సంబంధించిన రూ. 40 కోట్ల చర, స్థిర ఆస్తులను అటాచ్‌ చేయడం గమనార్హం. ఇది కాస్త ఎంకే అళగిరికి షాక్కే. ప్రస్తుతం డిఎంకే బహిష్కృత నేతగా రాజకీయలకు దూరంగా ఉంటూ వస్తున్న అళగిరి కుటుంబానికి  వ్యతిరేకంగా ప్రస్తుతం పరిణామాలు బయలు దేరడంతో ఆయన మద్దతు దారుల్లో ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఈ పరిణామాలు మున్ముందు తమ నేతను ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెడుతాయో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు