మంత్రి కాన్వాయ్‌ ఢీ కొని బాలుడి మృతి

29 Oct, 2017 09:18 IST|Sakshi

సాక్షి, లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో శనివారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. మంత్రి కాన్వాయ్‌లోని ఓ కారు ఐదేళ్ల బాలుడిని బలితీసుకుంది. అయితే ప్రమాదం తర్వాత కూడా వాళ్లు ఆపకుండా వెళ్లిపోవటం మరింత విమర్శలకు దారితీస్తోంది. 

బాలుడు తండ్రి విశ్వనాథ్‌ చెబుతున్నకథనం ప్రకారం.. శనివారం సాయంత్రం ఐదళ్ల శివ తన తల్లి, అత్తతో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో కొలనెల్‌గంజ్‌-పరసాపూర్‌ మార్గం గుండా మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ కాన్వాయ్‌ అటుగుండా వెళ్తోంది. ఇంతలో ఓ కారు బాలుడిని ఢీకొట్టగా.. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ప్రమాదం జరిగాక కూడా వాహనం ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు బాలుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 

అనంతరం బాలుడి తండ్రి విశ్వనాథ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కొలనెల్‌గంజ్‌ పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. మంత్రి ప్రయాణిస్తున్న కారే తన బిడ్డను బలితీసుకుందని, ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వనాథ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. శివ కుటుంబానికి 5 లక్షల పరిహారం ప్రకటించటంతోపాటు.. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌ కార్యాలయం ట్విట్టర్‌లో తెలిపింది.

మరిన్ని వార్తలు