ఎముకలు, పుర్రె లభ్యం

17 Apr, 2019 10:48 IST|Sakshi
ఘటనా స్థలి వద్ద లభ్యమైన వాహనం, (ఇన్‌ సెట్‌) మృతునిగా అనుమానిస్తున్న దుర్గాపురం వాసి కలమటి ప్రవీణ్‌కుమార్‌

మృతుడు దుర్గాపురం యువకుడిగా అనుమానం

8 నెలల కిందట అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు

మద్యం మత్తులో ప్రమాదానికి గురై ఉంటాడని అనుమానం

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాక పశ్చిమ): మర్రిపాలెం డీజిల్‌ లోకో షెడ్‌ సమీపంలో మంగళవారం ఓ బైక్, దాని పక్కనే మృతదేహం ఎముకలు, పుర్రె, లభ్యమయ్యాయి. ఈ విషయం తెలియడంతో దుర్గాపురం ప్రాంతంలో సంచలనంగా మారింది. ఎయిర్‌పోర్ట్‌ జోన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుర్గాపురానికి చెందిన యువకుడు కలమటి ప్రవీణ్‌కుమార్‌(23) 2018 సెప్టెంబర్‌ 26 నుంచి కనిపించడంలేదు. ఈ మేరకు అతని తల్లిదండ్రులు ఎయిర్‌పోర్ట్‌ జోన్‌ పోలీస్‌ స్టేషన్‌లో అదే నెల 28న ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం స్థానికులు మర్రిపాలెం డీజిల్‌ లోకో షెడ్‌ సమీపంలో ద్విచక్ర వాహనం పడిపోయి ఉండడం గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ ద్విచక్ర వాహనం సమీపంలో కొన్ని ఎముకులు, మృతుడి వస్త్రాలు కనిపించాయి. అక్కడికి కొద్ది దూరంలో పుర్రె ఉంది.

అయితే ప్రవీణ్‌కుమార్‌ తన వాహనంపై మర్రిపాలెం శ్రావణి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వెళ్లాడని... మద్యం సేవించాక అక్కడే ఉన్న మరో వాహనాన్ని తనదిగా భావించి తీసుకుని వెళ్లిపోయాడని... ఈ విషయం సీసీ కెమెరా ఫుటేజీలో నమోదైందని పోలీసులు చెబుతున్నారు. అక్కడి నుంచి మర్రిపాలెం డీజిల్‌ లోకోషెడ్‌ రహదారి మీదుగా వెళ్లాడని.., లోకోషెడ్‌కు సమీపంలో మలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన చోట దట్టమైన పొదలు ఉండడంతో ఎవరూ గుర్తించలేదు. మంగళవారం స్థానికులు ఎండు కర్రలు ఏరుకునేందుకు వెళ్లగా విషయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. అక్కడ లభించిన దుస్తులు ఆధారంగా మృతుడు దుర్గాపురం వాసి ప్రవీణ్‌ కుమార్‌గా గుర్తించారు. అయితే అతని తల్లి మాత్రం తన బిడ్డ కాదని రోదిస్తోంది. దీనిపై ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌ సీఐ జెర్రిపోతుల శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్‌ఐ నరసింహరాజు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు