వివాహితపై సామూహిక అత్యాచారం? 

23 Jan, 2020 06:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నిర్జన ప్రదేశంలో అపస్మారక స్థితిలో వివాహిత 

గమనించి ఆస్పత్రికి తరలించిన స్థానికులు  

చికిత్సపొందుతూ మృతి  

సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసుల అనుమానం

ఒంగోలు: నిర్జన ప్రదేశంలో అపస్మారక స్థితిలో ఉన్న ఓ మహిళ 108 ద్వారా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. సంతనూతలపాడు మండలం పేర్నమిట్టకు చెందిన వివాహిత.. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఒంగోలులో నివాసం ఉంటోంది. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. మంగళవారం రాత్రి కుమార్తెలు నిద్రపోయాక ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. తల్లి ఎంతకీ రాకపోవడంతో వేకువజామున పిల్లలు తలుపులు పగులగొట్టి బయటకొచ్చారు. సమీపంలో మరో ఇంట్లో నివాసం ఉంటున్న అమ్మమ్మకు విషయం చెప్పారు.

ఈ క్రమంలో ఒంగోలు నగర శివారు నిర్జన ప్రదేశంలో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను పందులు మేపుకొనే వారు గుర్తించి 108 సాయంతో ఒంగోలు ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు ఆమె నోట్లో బియ్యం కుక్కి ఉన్నట్టు గుర్తించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం ఆమె మృతిచెందింది.

ఘటనాస్థలంలో లభించిన ఆధారాలను బట్టి.. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి పిల్లలు, అమ్మమ్మ అందించిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించామని పోలీసులు చెప్పారు. బాధితురాలి చేతిపై పచ్చబొట్టు చెరిపేసేందుకు బలవంతంగా యత్నించిన ఆనవాళ్లు కనిపించాయని ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌ చెప్పారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు