‘మ్యాప్‌’తో గురి.. విల్లాల్లో చోరీ 

16 Jun, 2018 12:53 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ వెంకటేశ్వరరావు... నిందితుడు చంద్రశేఖర్‌(ఇన్‌సెట్‌లో)

నిందితుడి అరెస్టు   

రూ.30 లక్షల సొత్తు స్వాధీనం  

సాక్షి, హైదరాబాద్‌: ధనవంతులే టార్గెట్‌గా విల్లాల్లో చోరీలకు పాల్పడుతూ రెండేళ్లుగా చిక్కకుండా తిరుగుతున్న మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ను మాదాపూర్‌ సీసీఎస్, నార్సింగి పోలీసులు అరెస్ట్‌ చేశారని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మంజుల చంద్రశేఖర్‌ అలియాస్‌ చందు తొమ్మిదేళ్లుగా విల్లాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. 

నిందితుడిపై మాదాపూర్, గచ్చిబౌలి, నార్సింగి, పేట్‌బషీరాబాద్, నార్సింగి, ఆర్సీపురం, ఖమ్మం, తిరుపతి, వైజాగ్‌లలో కేసులున్నాయి. నిందితుడి నుంచి రూ.30 లక్షల విలువైన ఏడు తులాల బంగారు ఆభరణాలు, నాలుగు చేతి గడియరాలు, ఏనిమిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వివరించారు. వైజాగ్‌లోని రిషీ విల్లాలో చందు చోరీ చేసిన రూ.16 లక్షలు విలువైన రోలెక్స్‌ గడియారం, రూ.6 లక్షల విలువైన మరో గడియారం, 100గ్రాముల గంజాయి  స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని పట్టు కోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు రివార్డులు అందజేస్తామన్నారు. సమావేశంలో సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ జానకీ షర్మిల, సీసీఎస్‌ ఏసీపీ నర్సింహారెడ్డి, మాదాపూర్‌ ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.  

గూగుల్‌ మ్యాప్‌ సహాయంతో...   
చంద్రశేఖర్‌ చోరీ చేసిన స్మార్ట్‌ ఫోన్‌ లాక్‌ తీయించి, సిమ్‌కార్డు తీసేసి వైఫై ద్వారా ఇంటర్నెట్‌ ఉపయోగిస్తాడు. గూగుల్‌లో నగర శివారు ప్రాంతాల్లో విల్లాలు ఎక్కడున్నాయో గుర్తిస్తాడు. ఫెన్సింగ్‌ ఉన్నప్పటికీ రెక్కీ నిర్వహించి, వీలున్నా చోటు నుంచి లోపలికి వెళ్తాడు. చందుపై దాదాపు 40 కేసులున్నాయి. ఇతనిపై పీడీ యాక్టు కూడా నమోదు చేశారు.   

మరిన్ని వార్తలు