అయ్యో.. ఏం కష్టమొచ్చిందో.!

5 Nov, 2018 13:27 IST|Sakshi
రైలుకిందపడి మృతి చెందిన సౌజన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిరీష (మృతి చెందక ముందు) సౌజన్య శిరీష

రైలు కింద పడి తల్లీ కూతుళ్ల ఆత్మహత్య

కుటుంబ కలహాలే కారణమని అనుమానం

వైఎస్‌ఆర్‌ జిల్లా, రాజంపేట : రాజంపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన  ఆదివారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కూతురు తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది. స్థానికుల కథనం మేరకు రాజంపేట పట్టణం ఉస్మాన్‌ నగర్‌లో నివాసముంటున్న సౌజన్య (28)కు పెనగలూరు మండలం సిద్దవరానికి  చెందిన శ్రీనివాసులరెడ్డితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి శిరీష అనే ఐదేళ్ల పాప ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం బలిజపల్లె పరిధిలోని ఉప్పరపల్లె సమీపంలో ఉన్న రైలు పట్టాల వద్దకు ఆమె చేరుకుంది. రైలు వచ్చే సమయంలో రైలు కిందపడి కూతురుతో సహా  ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.

ఈ ప్రయత్నంలో తల్లిని రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్తె తీవ్ర గాయాలతో బయటపడింది. స్థానికులు గమనించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసి అనంతరం పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పాప కూడా మృతి చెందింది. సౌజన్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రేణిగుంట జీఆర్‌పీ సీఐ అశోక్‌ తెలిపారు. కాగా మృతురాలు మూడు నెలల గర్భిణిగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతురాలి తండ్రి సుబ్బారెడ్డి (సుబ్బన్న) ఆర్టీసీలో (వీఆర్‌ఎస్‌)  రిటైర్డ్‌ అయ్యారు. ఈయన ఎర్రబల్లిలో నివాసం ఉంటున్నారు. తల్లీబిడ్డ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.  

మరిన్ని వార్తలు