మందలించాడని మట్టుబెట్టించింది! 

23 Nov, 2019 10:14 IST|Sakshi
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్‌ 

తులసీనాయక్‌ హత్య కేసులో భార్యతో సహా ఐదుగురు అరెస్ట్‌ 

సాక్షి, మైదుకూరు : వివాహేతర సంబంధం విషయమై భర్త పలుమార్లు మందలించడంతో.. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది. చివరకు ప్రియుడితో కలిసి అంతమొందించింది. ఈ కేసులో ఆమెతో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు పోలీసు సబ్‌డివిజన్‌ కార్యాలయంలో డీఎస్పీ విజయ్‌కుమార్‌ విలేకరులకు వెల్లడించారు. కర్నూలు జిల్లా మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ముడావత్‌ తులసీనాయక్, సాలిబాయికి 17 ఏళ్ల కిందట వివాహమైంది. నాలుగేళ్ల కిందట వైఎస్సార్‌ జిల్లా టి.సుండుపల్లి మండలం మన్యంవారిపల్లెకు చెందిన మూడె రెడ్డినాయక్‌కు పెళ్లి సంబంధం కుదిర్చేందుకు వెళ్లిన సాలిబాయి అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై ఆమెను భర్త తులసీనాయక్‌ పలుమార్లు మందలించాడు. అతన్ని అంతమొందిస్తే తాము సంతోషంగా ఉండవచ్చునని రెడ్డి నాయక్‌తో కలిసి సాలిబాయి కుట్ర పన్నింది.

అందులో భాగంగా రెడ్డినాయక్‌ తన స్నేహితులైన చక్రాయపేట మండలం ఎర్రగుడి తండాకు చెందిన వినోద్‌కుమార్‌ నాయక్, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అయితేపల్లెకు చెందిన విజయ్‌కుమార్, విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన మునగపాటి జగన్నాథరాజుతో కలిసి.. తులసీనాయక్‌ను చంపేందుకు లక్ష రూపాయలకు సుఫారీ ఖరారు చేసుకున్నారు. రూ.30 వేలు అడ్వాన్సుగా చెల్లించారు. కాగా రెడ్డినాయక్‌.. సాలిబాయికి రూ.10 వేలు బాకీ ఉండటంతో ఆ సొమ్మును చెల్లిస్తానంటూ ఈ నెల 12న తులసీనాయక్‌ను వైఎస్సార్‌ జిల్లా దువ్వూరు మండలం చింతకుంట గ్రామ సమీపానికి పిలిపించారు. అక్కడ తులసీనాయక్‌కు మద్యం తాపారు. అనంతరం మద్యం బాటిల్‌తో కొట్టారు. అతను పారిపోబోగా తమ వద్ద ఉన్న స్కార్పియో వాహనంతో తొక్కించి చంపారు. అనంతరం మృతదేహాన్ని దువ్వూరు మండలం పెద్దజొన్నవరం మిట్ట దగ్గర జాతీయ రహదారి కల్వర్టు పక్కన పడేశారు. ఈ నెల 15న మృతదేహం ఉన్న విషయం తెలియడంతో దువ్వూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 

తప్పుదోవ పట్టించే యత్నం 
పోలీసులు కనుగొన్న మృతదేహం తన భర్తదేనని, అతని మరణానికి తమ గ్రామానికి చెందిన దమన పెద్దపుల్లయ్య కారణమని సాలిబాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సంఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు.. సాలిబాయి సెల్‌ఫోన్‌లోని కాల్‌ డేటాను పరిశీలించారు. ఆమె ప్రియుడు రెడ్డినాయక్‌తో రోజూ మాట్లాడుతున్నట్టు తెలుసుకున్నారు. ప్రియుడితో కలిసి ఆమె భర్తను అంతమొందించినట్టు నిర్ధారించారు.  శుక్రవారం నిందితులను అరెస్టు చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా