చార్జ్‌షీట్‌ దాఖలు చేసి న్యాయం చేయండి

5 Dec, 2018 08:43 IST|Sakshi

తలాక్‌ బాధితురాలు నస్రీన్‌ సుల్తానా

సాక్షి సిటీబ్యూరో: తన ప్రమేయం లేకుండా తన మామ మహ్మద్‌ యూసుఫ్‌ తన పేరున జహానుమా సిండికేట్‌ బ్యాంక్‌లో  అకౌంట్‌ తీయడమే కాకుండా తన భర్తను రెచ్చగొట్టి తనకు సౌదీఆరేబియా నుంచి పోస్టులో తలాక్‌ ఇప్పించాడని, దీనిపై ఫలక్‌నుమా పోలీసులకు సంప్రదించగా అతనిపై నవంబర్‌ 11న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, ఇంత వరకు చార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదని, పోలీసులు వెంటనే చార్జ్‌షీట్‌ దాఖలు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించాలని లేని పక్షంలో అతను తన భార్య మాదిరిగానే సౌదీకి పారిపోయే ప్రమాదం ఉందని తలాక్‌ బాధితురాలు సయిదాబాద్‌ నివాసి నస్రీన్‌ సూల్తానా అన్నారు. మంగళవారం సయిదాబాద్‌లోని తన నివాసంలో తన తండ్రి ఎస్‌ఎల్‌ రెహమాన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. సైదాబాద్‌కు చెందిన మహ్మద్‌ రహ్మన్‌ కుమార్తె నస్రీన్,  జహానుమా ప్రాంతానికి చెందిన మహ్మద్‌ యూసుఫ్‌ కుమారుడు మహ్మద్‌ అలీకి 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారు సౌదీఆరేబియాలో ఉండేవారు.

ఇటీవల ఆమె అరోగ్యం సరిగా లేకపోవడంతో వైద్యం కోసం హైదరాబాద్‌ వచ్చింది. వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు అవసరం కావడంతో డబ్బులు పంపాలని తన భర్తను కోరింది. అయితే అప్పటికే సౌదీలో ఉన్న కోడలి పేరుతో తప్పుడు సర్టిఫికెట్లతో తన అత్త షమీమ్‌ఉన్సీసా సంతకంతో మామ యూసుఫ్‌ అకౌంట్‌ తెరిచాడు. అదే అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్‌ చేసినట్లు మహ్మద్‌ అలీ చెప్పడంతో నస్రీన్‌ మామను నిలదీసింది. దీంతో అతను బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు తీసుకు వచ్చాడు. దీంతో నస్రీన్‌ ఈ విషయాన్ని తన తండ్రి రహ్మన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన  బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీయగా యూసుప్‌ నస్రీన్‌ పేరున అకౌంట్‌ తెరిచినట్లు తెలిపారు. దీనిపై మామను నిలదీయడంతో తన భర్తకు తప్పుడు మాటలు చెప్పి సౌదీ నుంచి తలాక్‌ చేయించాడని తెలిపింది. దీంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేయగా తన అత్త సౌదీకి పారిపోయిందని,  యూసుఫ్‌ కూడా సౌదీ పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. పోలీసులు వెంటనే అతని పాస్‌పోర్టును సీజ్‌ చేయాలని, చార్జ్‌షీట్‌ దాఖలు చేసి తనకు న్యాయం చేయాలని కోరింది.  

మరిన్ని వార్తలు