కోటక్‌ బ్యాంకుకు కొత్త సీఈఓ, ఎండీ నియామకం

21 Oct, 2023 19:15 IST|Sakshi

దేశీయ దిగ్గజ బ్యాంక్‌ అయిన కోటక్‌ మహీంద్రాకు కొత్త సీఈఓ, ఎండీగా అశోక్‌ వాస్వానీ నియమితులయ్యారు. బ్యాంక్‌ ఎండీగా ఉదయ్‌ కోటక్‌ వైదొలిగిన తర్వాత తాజా నియామకం జరిగింది. వాస్వానీ నియామకానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదం తెలిపింది. షేర్‌ హోల్డర్లు ఆమోదం తెలపాల్సి ఉందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. 2024 జనవరి 1లోగా అశోక్‌ వాస్వానీ బాధ్యతలు చేపట్టనున్నారు.

బ్యాంకింగ్‌ రంగంలో అశోక్ వాస్వానీకి దాదాపు ముప్పై ఏళ్ల అనుభవం ఉంది. గతంలో అంతర్జాతీయ బ్యాంక్‌ సిటీ గ్రూప్‌లో పనిచేశారు. బార్‌క్లేస్‌ బ్యాంక్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం యూఎస్‌-ఇజ్రాయెల్‌ ఏఐ ఫిన్‌టెక్‌ పగాయా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అంతేకాదు లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూప్‌, ఎస్‌పీ జైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ (యూకే) బోర్డు సభ్యులుగానూ ఉన్నారు. ప్రథమ్‌, లెండ్‌ హ్యాండ్‌ వంటి దాతృత్వ సంస్థల్లో డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. 

కోటక్‌ బ్యాంక్‌ సీఈఓ, ఎండీగా నియమితులు కావడం పట్ల వాస్వానీ సంతోషం వ్యక్తంచేశారు. స్వదేశానికి తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలోని అగ్రశ్రేణి 3 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్‌ను నిలిపే ప్రయాణంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రపంచస్థాయి బ్యాంకర్‌ అయిన అశోక్‌.. కోటక్‌ బ్యాంక్‌ను అద్భుతంగా తీర్చిదిద్దగలరని ఉదయ్‌ కోటక్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. కోటక్‌ బ్యాంక్‌ను ఖాతాదారులకు అనుకూల సంస్థగా మార్చేందుకు అశోక్‌ అనుభవం అక్కరకొస్తుందని తాత్కాలిక ఎండీ, సీఈఓ దీపక్‌ గుప్తా పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు