కడుపులో కత్తెర పెట్టి కుట్టేశారు

31 Oct, 2017 01:13 IST|Sakshi
చికిత్స పొందుతున్న చలపతి, ఎక్స్‌రేలో కత్తెర కనిపిస్తున్న దృశ్యం

నెల్లూరులో ప్రభుత్వ వైద్యుల నిర్వాకం

నెల్లూరు (బారకాసు): వైద్యం కోసం వెళ్లిన రోగికి ఆపరేషన్‌ చేసి.. అతడి కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేసిన ఘటన నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు నగరానికి చెందిన ఎస్‌.చలపతి  కొంత కాలంగా చలపతి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వైద్యం నిమిత్తం ఈనెల 2న నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లాడు.  కడుపు లో టీబీ వల్ల చీము పట్టి పేగులు పాడయ్యాయని వైద్యులు గుర్తించారు.

ఈనెల 3న జనరల్‌ సర్జన్‌ విభాగానికి చెందిన హెచ్‌ఓడీ డాక్టర్‌ పద్మశ్రీ, ఇతర వైద్యులు పద్మజారాణి, సాయిసుదీప్, వేణుగోపాల్‌ల బృందం ఆయ నకు శస్త్రచికిత్స చేసింది. ఆ సమయంలో డాక్టర్‌ పద్మజారాణి ఆపరేషన్‌కు ఉపయో గించే కత్తెరను రోగి కడుపులోనే వదిలేసింది. మిగిలిన వైద్యులు ఈ విషయం గమనించ కుండా కుట్లు వేసేశారు. దీంతో కోలుకోని చలపతి ఈనెల 27న ఆస్పత్రికి వచ్చి ఎక్స్‌రే తీయగా.. కడుపులో కత్తెర కన్పించడంతో వైద్యులు కంగుతిన్నారు.

ఈ విషయం బయటకు పొక్కనివ్వకుండా  ఈ నెల 28న చలపతికి రెండోసారి ఆపరేషన్‌ చేసి కడుపులో ఉన్న కత్తెరను తొలగించారు.  దీనిపై ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీహరిని వివరణ కోరగా.. దీనిపై పూర్తిస్థాయి విచారణ నిర్వహిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు